– వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానల్
– రైతు చేతిలో ప్రభుత్వం పధకాల,సాగు సంగతులు సమాచారం
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు నేస్తం పేరుతో సాగు సంగతులు,సేద్యంలో మెలుకువలు, సస్యరక్షణ పై ప్రతీ మంగళవారం రైతు వేదికల్లో ఏర్పాటు చెందిన వీసీ యూనిట్ లతో,వ్యవసాయ విద్యలో నిపుణులతో దూర విద్యను అమలు చేస్తుంది.
దీనికీ అనుసంధానంగా ఫోన్ కలిగిన ప్రతి రైతు చేతిలో వ్యవసాయ సమగ్ర సమాచారం,ప్రభుత్వం అందించే పధకాల వివరాలు,రోజువారీ వాతావరణం,ఋతువులు వారీ పంటలు సాగు,యాజమాన్యం పద్దతులు తెలుసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానెల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెండ్యాల రవికుమార్ తెలిపిన సమాచారం మేరకు ప్రతి క్లస్టర్ స్థాయిలో రైతులు ఈ ఛానల్ ద్వారా వ్యవసాయానికి సంబందించిన అధికారిక సమాచారం తెలుసుకోవచ్చు.
ఒక్కో వ్యవసాయ విస్తర్ణాధికారి తన పరిధిలోని కనీసం వంద మంది రైతులు ఈ ఛానల్ అనుసరించేలా లక్ష్యం నిర్దేశించారు. అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లోని 17 క్లస్టర్ల లో ఏఈఓ లకు రైతులను ఈ ఛానల్ అనుసరించే లా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్, డైరెక్టర్ లు పర్యవేక్షణలో ఈ వాట్సాప్ ఛానెల్ నిర్వహించబడుతుంది.
ఈ ఛానల్ ద్వారా సమయానుకూల మైన, నమ్మకమైన,ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం నేరుగా రైతుల చేతుల్లోకి చేరుతుంది.
ఈ ఛానెల్ లో రైతులు పొందగల సమాచారం:
ప్రభుత్వ పథకాలు,సబ్సిడీ వివరాలు.
పంటల సంరక్షణ,ఋతువుల సూచనలు.
వాతావరణ హెచ్చరికలు,కీటక నియంత్రణ మార్గదర్శకాలు.
మార్కెట్ ధరలు,శిక్షణా కార్యక్రమాల సమాచారం.
రైతు నేస్తం కార్యక్రమాల షెడ్యూల్,రాష్ట్రంలోని 1600 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ లలో నిర్వహించబోయే అంశాలు. ఉత్పాదకత పెంపు,రైతుల ఆదాయం పెంపు,మరియు స్థిరమైన వ్యవసాయం వైపు ముందుకు సాగడానికి ఈ ఛానెల్ రైతు సేవలో మరో కలికితురాయి కానుంది.