Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునాసిరకం బత్తాయి మొక్కలతో..నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

నాసిరకం బత్తాయి మొక్కలతో..నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

- Advertisement -

నవతెలంగాణ-నల్లగొండటౌన్ : తిరుపతి రీసెర్చ్ స్టేషన్ అనుబంధ సంస్థలైన మహానంది, పెట్లూరు, తిరుపతి నుండి తీసుకొచ్చి నాసిరకం బత్తాయి మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా తదుపరి సాగు చేసే రైతులకు నాణ్యమైన బత్తాయి మొక్కలను అందించాలని కోరుతూ బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం. కోదండరెడ్డికి, కమిషన్ గౌరవ సభ్యులు భవానిరెడ్డి, రాంరెడ్డిగోపాల్రెడ్డి, సునీల్, చౌడు వెంకన్న సమక్షంలో బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార నల్లగొండ జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కోశాధికారి ఎన్.నిర్మల్రావు మాట్లాడారు. గత దశాబ్దకాలంగా నాసిరకమైన మొక్కల పెంపకంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆర్థికంగా కుంగిపోయారన్నారు. సరైన దిగుబడి రాకపోవడంతో సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. నల్లగొండ జిల్లాలో దశాబ్దకాలంగా సాగు చేస్తున్న మొక్కలన్ని వైరస్ ఎపెక్టువేనన్నారు. తిరుపతి రీసెర్చ్ స్టేషన్ అనుబంధ సంస్థలైన మహానంది, పెట్లూరు, తిరుపతి నుండి తీసుకొచ్చి సాగు చేసిన నాసిరకంమొక్కలతో రైతులంతా నష్టపోయారన్నారు. రైతులు మంచినాణ్యత గల మొక్కలు, పంట విత్తనాలను పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవి కీటకాల నుండి విముక్తమైనవి, వైరస్ లేని పంటలు కాకపోవడంతో పంట దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. దీంతో ఆప్రభావం చాలా కుటుంబాల ఆర్థికస్థితిగతులపై పడుతుందన్నారు. హార్టికల్చర్ విభాగం అధికారులు, సీసీఆర్ ఐ నాగపూర్ నుండి హార్టికల్చర్ శాస్త్రజ్ఞులు మా పొలాలకు రాగా మాములుగా ఉండే మొక్కలలో వైరస్ ఉందని గుర్తించారని చెప్పారు. తాము నష్టపోయిన పంటలకు పరిహారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంతంలోని బత్తాయి పంటకు నల్లగొండలో ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మార్కెట్ తమ పంటలను సులభంగా అమ్మడానికి, మద్దతు ధర పొందేందుకు సహాయపడుతుందన్నారు. బత్తాయి రసం, ఇతర విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చడానికి జ్యూస్ ఫ్యాక్టరీ, ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించాలని కోరారు. తద్వారా పంటల తర్వాత నష్టం తగ్గడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో పంటల పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యల మూలాలను గుర్తించాలని కోరారు. పంటల నాణ్యత పెంచడానికి, పంట ఆరోగ్యం కాపాడానికి సలహాలు, సూచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లి రీసెర్చ్ స్టేషనన్ను నాగపూర్ రీసెర్చ్ స్టేషన్ సబ్ సెంటర్గా అభివృద్ధి చేయాలని, తద్వారా రైతులకు నాణ్యమైన మొక్కలు అందడంతో పాటు ఎప్పటికప్పుడు వచ్చే తెగుళ్లపై అవగాహన పెరుగుతుందన్నారు. ఉపాధిహామీ చట్టం ద్వారా అందించే సబ్సిడీలను ఎలాంటి షరతుల్లేకుండా నాసిరకం బత్తాయి మొక్కలు పెంచిన రైతులకు అందించాలని కోరారు. నష్టపోయిన రైతుల తోటలను సందర్శించడానికి గౌరవ కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారన్నారు. వినతిపత్రం అందజేసిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార నల్లగొండ జిల్లా సంఘం గుర్రం శ్రీనివాస్ రెడ్డి, రైతులు ఎస్.వెంకట్రెడ్డి, సీహెచ్.రమేశ్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad