నవతెలంగాణ-హైదరాబాద్: గాజాను పూర్తిగా ఆక్రమించడానికి ఇజ్రాయిల్ ప్రధాని బరితెగించారు. ఇప్పటికే ఆ ప్రాంతంపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఆదేశ సైన్యం ఐడీఎఫ్ మానవ హననానికి పాల్పడుతోంది. నిరాయుధులపై క్షిపణులు దాడులు చేస్తూ నరమేధం సృష్టిస్తుంది. యుద్ధ బాధితులకు ఎలాంటి సాయం అందకుండా అడ్డకులు సృష్టిస్తూ..ఆకలి చావులను ప్రోత్సహిస్తుంది. పౌరుల నివాసాలు, దవాఖానాలు, చర్చిలు అనే బేధం లేకుండా పలు భవనాలను ఇజ్రాయిల్ సైన్యం నేలమట్టం చేస్తుంది. దీంతో గాజాలో ఎటూ చూసినా పూడిదతో కూడిన ప్రాంతమే దర్శనమిస్తుంది. ఆ కూలిన శిథిలాల కింద గుట్టలుగా మృతదేహాలు పోగుబడి ఉన్న హృదయవిదాకర దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఇజ్రాయి దుశ్చర్యపై ప్రపంచ దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నా..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండతో నెతన్యాహు పేట్రేగి పోతున్నారు.
గాజాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రూపొందించిన సైనిక ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ భారీ ఆపరేషన్ కోసం సుమారు 60,000 మంది రిజర్విస్ట్ సైనికులను రంగంలోకి దించుతుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
బుధవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ ప్రణాళికకు ఆమోదముద్ర వేశారు. ‘గిడియన్స్ చారియట్స్ II’ పేరుతో చేపట్టనున్న ఈ ఆపరేషన్ లక్ష్యం గాజా నగరాన్ని చుట్టుముట్టి, హమాస్‌ను నిర్మూలించడం, బందీలను విడిపించడం, పూర్తి భద్రతా నియంత్రణను స్థాపించడం అని తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) గాజా నగర శివారు ప్రాంతాల్లోకి ప్రవేశించి, ఆ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. భూతల దాడికి ఇజ్రాయెల్ బలగాలు సిద్ధమవుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
మరోవైపు, గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాలోని 81 శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార అభద్రతతో సతమతమవుతున్నాయని, పోషకాహార లోపం తీవ్రస్థాయిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ‘ ఈ చర్యలు ఆ ప్రాంతాన్ని “శాశ్వత యుద్ధ చక్రం”లోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. “గాజాలో ఇజ్రాయెల్ సిద్ధం చేస్తున్న సైనిక దాడి రెండు దేశాల ప్రజలకు విపత్తుకు దారితీస్తుంది. మొత్తం ప్రాంతాన్ని శాశ్వత యుద్ధ చక్రంలోకి నెట్టే ప్రమాదం ఉందని’ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేయడంపై జర్మన్ ప్రభుత్వం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ మేయర్ విలేకరులతో మాట్లాడుతూ, “ఈ చర్యలు అన్ని బందీలను విడిపించడానికి లేదా కాల్పుల విరమణకు ఎలా దారితీస్తాయో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది” అని అన్నారు.
UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ కూడా ఇజ్రాయెల్ ఆమోదించడాన్ని ఖండించారు. ‘ఇజ్రాయిల్ తన నిర్ణయాన్ని అమలు చేస్తే.. పాలస్తీనా రాజ్యాన్ని రెండుగా విభజిస్తుంది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది” అని అన్నారు.