నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు వింత వ్యాఖ్యలు చేశాడు. వీధికుక్కల కోసం తాను సీఎంపై దాడి చేశానని, అలా చేయమని తనకు శివుడే చెప్పాడని నిందితుడు రాజేశ్ సకారియా వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని, వీధికుక్కల సమస్యపై ఢిల్లీ వెళ్లి సీఎం సహాయం కోరమని సాక్షాత్తూ శివుడే తనకు చెప్పాడని పోలీసుల విచారణలో సకారియా చెప్పాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేశ్ సకారియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడు టికెట్ లేకుండానే రైలెక్కి గుజరాత్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు.
నిన్న షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, వీధికుక్కలను తరలించవద్దని కోరుతూ ఆమెకు ఒక వినతిపత్రం సమర్పించాడు.ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన సకారియా, ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఆమె చెంపపై కొట్టి, దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.ప్రస్తుతం సకారియాపై పోలీసులు హత్యాయత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.