నవతెలంగాణ-హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో పాసైంది. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. విపక్షాలు తీవ్ర ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే బిల్లును పాస్ చేశారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లుకు పచ్చజెండా ఊపారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో జరిగే అన్ని రకాల మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు.
అయితే ఈక్రమంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు, పెద్దల సభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గేకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రతిపక్షాలకు బిల్లుపై చర్చించే అవకాశమివ్వకుండా..సదురు బిల్లును ఆమోదించడం సరైన విధానం కాదని ఖర్గే మండిపడ్డారు. విపక్షాలు సూచనలు చేసిన పరిగణనలోకి తీసుకోకున్న ఫర్వాలేదని, చర్చ సందర్భంగా వారు చెప్పే విషయాలన్న వినాలన్నారు. కనీసం వారు మాట్లాడానికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులందరూ సభలో ఉన్నప్పటికి వారి సలహాలు, అభిప్రాయాలు వినకుండా..బిల్లును రాజ్యసభ ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ఖర్గే రాజ్యసభ వైస్ ఛైర్మెన్‌ను ప్రశ్నించారు.
ఖర్గే ప్రశ్నకు ఉప సభాపతి స్పందిస్తుండగా..రిజిజు జోక్యం చేసుకొని మాట్లాడారు. సభ కార్యక్రమాలు సక్రమంగా జరగకుండా విపక్షాలు ప్రతిఘటిస్తునన్నాయి. బిల్లులపై చర్చ జరిపే సమయంలో ప్రతిపక్షాలు సభకు సహకారం అందించట్లేదని రిజిజు అన్నారు. సభలో అనవసరమైనా విషయాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని, సభ నియమాలు అందరూ పాటించాలన్నారు.