నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భచాకు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఇన్‌స్టిట్యూట్ ఆప్ సీస్మొలాజికల్ రీసెర్చ్ వెల్లడించింది.
రాత్రి 10.19 గంటల సమయంలో 2.7 తీవ్రతతో భూమి కంపించిందని తెలిపింది. రాపార్‌కు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొంది. వరుస భూకంపాల వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. కాగా, కచ్ అత్యంత ప్రమాదకర భూకంప జోన్‌లో ఉన్నది. జిల్లాలో 2001లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 7.8 తీవ్రతతో వచ్చిన ప్రకంపణలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో వేలాది మంది చనిపోయారు.
గురువారం రాత్రి 11.56 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.0గా నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ తెలిపింది.