నవతెలంగాణ-హైదరాబాద్: నైరుతి పవనాల చురుకుదనంతో యావత్తు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈక్రమంలో తెలంగాణలో కూడా ఎడతెరిపి లేకుండా వానాలు కురియడంతో..ఆయా జిల్లాల్లోని నదులు, వాగుల, వంకలు, చెరువులు పలు రిజర్వాయర్లు పొంగిపోర్లుతున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పొటెత్తడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం ( గత తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది.
సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద పారుతున్నది. గర్భగుడి ముందున్న మూడు పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న నాలుగు పాయలు కలిసి ఒకే పాయగా మంజీర నది ప్రవహిస్తోంది.
దీంతో ఆలయాన్ని మూసివేసిన అధికారులు.. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్టవైపు, గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.