నవతెలంగాణ-హైదరాబాద్: జైలు పాలైన పీఎం, సీఎం, మంత్రులెవరైనా.. తమ పదువులు కోల్పోయే రీతిలో ఇటీవల పార్లమెంట్‌లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై బీహార్‌లోని గయా బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జైలు నుంచి ఎందుకు ప్రభుత్వాన్ని నడపాలి అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిని 50 గంటల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నాడని, అతను డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా .. జాబ్ పోతోందన్నారు. కానీ సీఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు.
గతంలో కొందరు జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేసేవారని, జైలు నుంచే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేవారన్నారు. ఒకవేళ ప్రజానేతకు అటువంటి వ్యక్తిత్వం ఉంటే, అప్పుడు మనం అవినీతిని ఎలా ఎదుర్కుంటామని ప్రధాని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిందన్నారు. ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని మోదీ అన్నారు. ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సీఎం అయినా.. 31వ రోజు తన పదవిని కోల్పోవాల్సి వస్తుందన్నారు.