నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ అదనపు సుంకాల వేళ భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పోస్టల్ శాఖ అమెరికాకు తన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెం. 14324 నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ ప్రకారం ప్రకారం ఆగస్టు 29 నుంచి 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు ఇచ్చే కస్టమ్స్ పన్నుల మినహాయింపు రద్దు చేసింది.
అయితే 100 డాలర్ల వరకు విలువైన బహుమతి వస్తువులు మాత్రం సుంకాలు విధించబడవు. ఈ కొత్త రూల్ వలన భారత పోస్టల్ శాఖ 100 డాలర్ల వరకు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను మినహాయించి, అన్ని పోస్టల్ సేవలను నిలిపివేస్తోంది.
అమెరికా కొత్త కస్టమ్స్ విధానం వల్ల ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా అమెరికాకు పార్సెల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నిర్ణయం ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమెరికాకు జరిగే లో-వాల్యూ షిప్‌మెంట్లపై గణనీయమైన ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.