నవతెలంగాణ-హైదరాబాద్ : మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. శనివారం జరిగిన ఈ సమావేశం దాదాపు 15 గంటల పాటు నిర్విరామంగా సాగినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ మీడియా సమావేశం, అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసింది. 46 ఏళ్ల ముయిజ్జు మొత్తం 14 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యలో కేవలం ప్రార్థనల కోసం మాత్రమే స్వల్ప విరామాలు తీసుకున్నారని అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో దాదాపు రెండు డజన్ల మంది పాత్రికేయులతో పాటు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు కూడా ముయిజ్జు సమాధానాలు ఇచ్చారు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులకు ఆహార ఏర్పాట్లు కూడా చేశారు.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని (శనివారం) పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా ముయిజ్జు మాట్లాడుతూ.. పత్రికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. వాస్తవాలను సమతుల్యతతో, నిష్పాక్షికంగా రిపోర్ట్ చేయాలని మీడియాకు పిలుపునిచ్చారు. 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మాల్దీవుల ర్యాంకు 104కు (రెండు స్థానాలు మెరుగుపడి) చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2023లో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు పారదర్శకతకు, మీడియాతో స్వేచ్ఛాయుత చర్చలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ రికార్డు స్థాయి సమావేశమే నిదర్శనమని ఆయన కార్యాలయం పేర్కొంది.
ప్రపంచ రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES