నవతెలంగాణ-హైదరాబాద్: ఏండ్ల తరబడి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అందుకు ఆ రెండు దేశాల అధినేతలతో పలు దఫాలుగా ఆయా దేశాల నేతలు చర్చలు కొనసాగించారు. జెలెన్ స్కీతో ఈయూ నాయకులు భేటీ పలు విధాలుగా శాంతిచర్చలపై చర్చించారు. అదే విధంగా అలాస్కా వేదికగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..రష్యా అధినేత పుతిన్‌తో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. గంటల తరబడి చర్చలు కొనసాగినప్పటికి ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాతో మాట్లాడారు. ఆయనతో జరిగిన చర్చల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే జెలెన్‌స్కీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి అభ్యర్థన మేరకు మాట్లాడాను. వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశాల వివరాలు పంచుకున్నాను. రష్యా అధ్యక్షుడితో సమావేశానికి సిద్ధమని మరోసారి తెలియజేశానని పేర్కొన్నారు.