నవతెలంగాణ-హైదరాబాద్: భారత క్రికెట్‌కు సీనియర్ టెస్ట్ ప్లేయర్ ఛెటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2023లో ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు నుంచి చోటు కోల్పోయిన తర్వాత పుజారా గత కొన్నాళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ, సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇకపై తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పుజారా నిర్ణయాన్ని పలువురు క్రికెటర్‌లు స్వాగతిస్తున్నారు.
కెరీర్ పరంగా చూసుకుంటే.. పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. 43.60 సగటుతో మొత్తం 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు మరియు 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నారు. ఆ సిరీస్‌లో మొత్తం 521 పరుగులు చేసి, భారతదేశం తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే టెస్ట్‌లలో రాణించిన పుజారా వన్డేలలో రాణించలేకపోయాడు. తన క్రికెట్ కెరీర్‌లో కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడారు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే పుజారాని చూసి రాహుల్ ద్రవిడ్ తర్వాత, పుజారాను ‘నయా వాల్’ అని పిలిచేవారు.