నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల యూఎస్ పోస్టల్ సర్వీసులను ఇండియా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియా బాటలోనే న్యూజిలాండ్ నడిచింది.అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు న్యూజిలాండ్ పోస్టల్ సర్వీస్ తెలిపింది. న్యూజిలాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 15శాతం టారిఫ్‌లు ఈనెల 29 నుండి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 21 నుండి పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు న్యూజిలాండ్ పోస్ట్ తెలిపింది. పరిమితమైన లేఖలు మరియు ముఖ్యమైన పత్రాలు, పాస్‌పోర్ట్‌లు లేదా చట్టపరమైన లేఖలు వంటివి మాత్రమే అమెరికాకు పంపబడతాయని క్యారియర్ వెబ్‌సైట్‌లోని ఒక ప్రకటన పేర్కొంది. తమ సేవల్లో మార్పులు చేయడానికి యత్నిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా డెలివరీలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
టారిఫ్‌ల ప్రభావంపై గందరగోళం నెలకొందని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం పేర్కొన్నారు. టారిఫ్‌ల రేటు ఏవిధంగా ఉంటుంది, ఖర్చు అవుతుందా లేదా ఆచరణాత్మకంగా పనిచేస్తాయా లేదా అనే అంశాలపై పోస్టల్ సంస్థలు హామీ ఇవ్వలేకపోతున్నాయని అన్నారు. ఇతర దేశాల్లోని సహచరులతో పాటు స్పష్టత పొందేందుకు న్యూజిలాండ్ అమెరికాతో కలిసి పనిచేస్తుందని అన్నారు.
ఆగస్ట్ 29నాటికి అమెరికాలోకి ప్రవేశించే చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపును రద్దు చేస్తామని ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన తర్వాత భారత్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియా మరియు డెన్మార్క్‌లలో పోస్టల్ సేవలు మరియు మెయిల్ కారియర్లు పోస్టల్ డెలివరీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో.. న్యూజిలాండ్ కూడా ఆయా దేశాల బాటలో చర్యలు చేపట్టింది.