నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన సుమారు అరడజను డ్రోన్లు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద కనిపించడంతో భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. నిఘా కోసమే పాకిస్థాన్ ఈ డ్రోన్లను పంపి ఉంటుందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్టు 24, ఆదివారం రాత్రి రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనీ, కనుయియాన్, బల్జరోయి సెక్టార్లలో ఈ డ్రోన్ల కదలికలను గుర్తించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ డ్రోన్లు ఎల్ఓసీ వద్ద కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టి తిరిగి పాక్ వైపు వెళ్లిపోయినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.
ఈ డ్రోన్లను నిఘా లేదా కీలక సమాచార సేకరణ కోసం పంపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అయితే, వీటి ద్వారా ఆయుధాలు గానీ, ఇతర పేలుడు పదార్థాలు గానీ జారవిడిచినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) వెంటనే రంగంలోకి దిగాయి. సరిహద్దు వెంబడి గస్తీని, నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.
గతంలోనూ పాకిస్థాన్ వైపు నుంచి ఇలాంటి డ్రోన్ల చొరబాట్లు జరిగిన సందర్భాలున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు, భారత సైనిక స్థావరాల సమాచారం తెలుసుకునేందుకే పాక్ ఈ చర్యలకు పాల్పడుతోందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తాజా ఘటనతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.