
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపించ నున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు. వేసవి కానుకగా మే 9వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం.జ్యోతి కృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.