Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుబీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే

బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే

- Advertisement -

– మోడీతో రేవంత్‌ రెడ్డిలో పాయికారి ఒప్పందం
– యూరియా సంక్షోభానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణకు ద్రోహం చేయడంలో కాంగ్రెస్‌, బీజేపీలు దొందూ దొందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి రేవంత్‌ సర్కార్‌దే పూర్తి బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ సీనియర్‌ నాయకులు అలూరి విజయభారతి, పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో కేసీఆర్‌ ప్రారంభించిన భవనాలనే సీఎం రేవంత్‌ రెడ్డి మళ్లీ ప్రారంభించారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని రీతిలో వికృతమైన మాటలు, బండబూతులను రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. జేబులో కత్తెర పెట్టుకుని కట్టిన భవనాలను ప్రారంభించడానికి సీఎం తిరుగుతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. మోడీ, చంద్రబాబు ఆదేశాలతో గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు, అక్కడ్నుంచి తమిళనాడుకు పంపించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. వారి ఆదేశాల మేరకే రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ బట్టారని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌ రెడ్డి సినీ పరిశ్రమ వారితో సమావేశాలు నిర్వహించారని విమర్శించారు. యూరియా కొరతకు ఆపరేషన్‌ సిందూర్‌ కారణమంటూ బీజేపీ రేవంత్‌ రెడ్డిని వెనుకేసుకు వచ్చిందని తప్పుపట్టారు. బడా మోడీ, చోటా మోడీల దొంగాటతో రాహుల్‌కు దెబ్బ తాకటం ఖాయమని కేటీఆర్‌ హెచ్చరించారు. అమృత్‌ స్కాం, హెచ్‌సీయూ భూముల స్కామ్‌లపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆయన ఉదహరించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, విభజన హామీల అమలులో బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసిందనీ, హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ కారిడార్‌ను కాదని బుందేల్‌ఖండ్‌కు తరలించిందనీ, కేన్స్‌, మైక్రాన్‌ వంటి సంస్థల రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులను కూడా గుజరాత్‌కు తరలించారని ఆయన వివరించారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్‌ కాలేజీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను కూడా బీజేపీ ఇవ్వలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. అలాగే, పసుపు బోర్డును చిన్న రూమ్‌కు పరిమితం చేసిందనీ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హౌదా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ 20 నెలల పాలన నచ్చకుంటే రాబోయే ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటేసి తీర్పు ఇవ్వాలని ప్రజలకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad