నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ శాంతినే కోరుకుంటుందని, “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు, అది ఇప్పటికీ కొనసాగుతోంది” అని త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఆర్మీ వార్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ‘రణ్ సంవాద్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ పేరును ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపారు.
ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, “భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది. మేము శాంతిని ప్రేమించే వాళ్ళం. అయితే దానిని ఆసరాగా చేసుకుని మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు” అని అన్నారు. గతంలో జరిగిన యుద్ధాలకు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలకు వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు.