నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మృతి చెందగా, మరో 10 తీవ్రంగా గాయపడ్డారు. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ప్రఖ్యాత వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
అంతేకాకుండా దోడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించగా, ఆకస్మిక వరదల్లో చిక్కుకుని మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌బరస్ట్) కూడా సంభవించినట్లు సమాచారం. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దోడా, కిష్త్వార్ జిల్లాలను కలిపే జాతీయ రహదారి-244 కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు శ్రీనగర్ నుంచి జమ్మూకు సీఎం ఒమర్ అబ్దుల్లా బయలుదేరారు. అత్యవసర పునరుద్ధరణ పనుల కోసం జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశాం” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వరద సంసిద్ధతపై ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, అన్ని శాఖలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.