శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌ని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు 10మంది మరణించారు. వీరిలో రియాసీ జిల్లాలో వైష్ణో దేవీ ఆలయానికి వెళ్ళే మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో ఆరుగురు యాత్రికులు మరణించగా, 14మంది గాయపడ్డారు. మరికొంతమంది శిధిలాల కింద చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు. దాదాపు మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కొండ ప్రాంతం ఒక్కసారిగా కుంగినట్లు అయి, పెద్ద ఎత్తున రాళ్ళు బండరాళ్ళు పెద్ద మొత్తంలో మట్టి ఒక్కసారిగా పడ్డాయి. దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అద్కావరి వద్ద ఇంద్రప్రస్థ భోజనాలయకు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆలయ బోర్డు ఎక్స్ పోస్టులో పేర్కొంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో అనేక ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించి నలుగురు మరణించారు. ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా, ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మృతి చెందారు. నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాల్సిందిగా జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది. భారీ వర్షాలు, కూలిన కొండచరియలు, పై నుండి రాళ్ళు పడడం వంటి కారణాలతో దోడా, కిష్టావర్‌లను కలుపుతున్న 244వ నెంబరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ ప్రాంతంలో పాఠశాలలు, కార్యాలయాలు మూత పడ్డాయి. వంతెనలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మౌలిక సదుపాయాలు బాగా దెబ్బ తిన్నాయి. చాలాచోట్ల సమాచార వ్యవస్థ స్తంభించింది. దీంతో సమస్యలు మరింత పెరిగాయని అధికారులు తెలిపారు.
పొంగి పొర్లుతున్న మూడు నదులు
మరోవైపు మూడు ప్రధాన నదులైన తావి, రావి, చీనాబ్‌లు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కథువాలో రావి నది అనేక చోట్ల పొంగిపొర్లుతోంది. దాంతో పల్లపు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. కిష్టావర్ జిల్లాతో కాశ్మీరు లోయను కలిపే సింథాన్ టాప్ పాస్‌ను మూసివేశారు. రంబాన్ జిల్లాలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి కూడా మూతపడింది. భారీగా మంచు కురుస్తుండడంతో శ్రీనగర్-లేV్‌ా జాతీయ రహదారి కూడా మూతబడింది. రాగల 40గంటల్లో జమ్మూలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు.
సీఎం పర్యవేక్షణ
జమ్మూ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా వుందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించ డానికి శ్రీనగర్ నుంచి ఆయన బయలుదేరుతున్నట్టు తెలిపారు. ఈలోగా అక్కడ అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఆకస్మిక వరదలు సంభవించిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశంలో అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రంగంలోకి దిగిన సైన్యం
జమ్మూ సెక్టార్‌లో నాలుగు కాలమ్‌ల సైన్యం రంగంలోకి దిగి వేర్వేరు చోట్ల సహాయక చర్యలు చేపట్టింది. ఆర్.ఎస్.పురా సెక్టార్‌లో ఒక భవనంలో దాదాపు 12మంది చిక్కుకుపోగా వారిని సురక్షితంగా కాపాడారు. షేర్ కాశ్మీర్ యూనివర్సిటీ భవనంలో చిక్కుకుపోయిన విద్యార్ధులను తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. మకురా గ్రామంలో వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 70మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు
- Advertisement -
- Advertisement -