Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకమీషన్‌ కోసం రేషన్‌డీలర్ల ఎదురుచూపు

కమీషన్‌ కోసం రేషన్‌డీలర్ల ఎదురుచూపు

- Advertisement -

– కేంద్రం ఐదు, రాష్ట్రం నుంచి మూడు నెలల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సింది
– రూ.100 కోట్లకు పైనే..
– నిర్వహణ భారంతో సతమతం
– సెప్టెంబర్‌ 5న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు
– పాత విధానంలోనే కమీషన్‌ను
– ఒకేసారి విడుదల చేయాలని రేషన్‌ డీలర్ల డిమాండ్‌

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న రేషన్‌ డీలర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఐదు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కమీషన్‌ విడుదల కాకపోవడంతో, దుకాణాల నిర్వహణ భారమై, అప్పులు చేయాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నారు. ఇందులో వికలాంగులు కూడా ఉన్నారు. ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటి వరకు ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వ కమీషన్‌ డబ్బులు వారికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కమీషన్‌ ఇవ్వాలి. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాటపట్టారు.
నవతెలంగాణ-కరీంనగర్‌

రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 17,286 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతినెలా 1.70 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.140 చొప్పున డీలర్లకు కమీషన్‌ చెల్లించాలి. ఈ లెక్కన ప్రతినెలా సుమారు రూ.20 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండగా, ఐదు నెలలకుగాను బకాయిలు రూ.100 కోట్లకుపైగా పేరుకుపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో డీలర్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు రావాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు దాటింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో సుమారు 2,200 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. కమీషన్‌ రాకపోవడంతో దుకాణాల అద్దె, విద్యుత్‌ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులను భరించలేక, అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు ఏమయ్యాయి..?
గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం, తాము అధికారంలోకి వస్తే రేషన్‌ డీలర్ల కమీషన్‌ను క్వింటాల్‌కు రూ.140 నుంచి రూ.300కి పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రతినెలా రూ.5,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా వాగ్దానం చేసింది. అయితే, ఈ హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని డీలర్లు అంటున్నారు. పాత బకాయిలు చెల్లించకపోగా, కొత్త హామీలను విస్మరించడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోరాట బాటలో డీలర్లు
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డీలర్లు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. తక్షణమే ఐదు నెలల కమీషన్‌ బకాయిలను విడుదల చేయాలని, నెలనెలా సకాలంలో కమీషన్‌ చెల్లించాలని, హామీ ఇచ్చిన గౌరవ వేతనం, కమీషన్‌ పెంపును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు, సెప్టెంబర్‌ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌ పాటించనున్నట్టు ప్రకటించారు.
త్వరలో చెల్లిస్తాం..
రేషన్‌ డీలర్ల కమీషన్‌ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కమీషన్‌ విడుదల చేసింది. మిగిలిన మూడు నెలలకు సంబంధించిన కమీషన్‌ విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే అది కూడా విడుదల చేస్తాం.
డీఎస్‌వో నర్సింగరావు
ప్రభుత్వాలు డీలర్ల సమస్యలపై సీరియస్‌గా స్పందించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమీషన్లు మంజూరు చేస్తున్నా, వాటి విడుదలలో నెలల తరబడి ఆలస్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలలకుగాను రెండు నెలల కమీషన్‌ మాత్రమే ఇటీవల విడుదల చేసింది. మిగిలిన మూడు నెలల కమీషన్‌ ఇప్పటికీ రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఐదు నెలలుగా కమీషన్‌ విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో రేషన్‌ డీలర్లు అప్పుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్లకు రావాల్సిన మొత్తాన్ని విడుదల చేయాలి.
రొడ్డ శ్రీనివాస్‌,
డీలర్ల సంఘం కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు

తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం..
2025 ఏప్రిల్‌, మే నెలల బియ్యం పంపిణీ చేశాం. జూన్‌, జులై, ఆగస్టు మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకేసారి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పారదర్శకంగా పంపిణీ చేపట్టాం. అయినప్పటికీ ఐదు నెలలుగా రేషన్‌ డీలర్లకు కమీషన్‌ విడుదల కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కాకుండా, పాత విధానంలోనే రేషన్‌ డీలర్ల కమీషన్‌ను ఒకేసారి విడుదల చేసి నేరుగా డీలర్ల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలి.
బోగ రాజేశం, కొత్తపల్లి రేషన్‌ డీలర్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad