నవతెలంగాణ-దుండిగల్/సిటీబ్యూరో : మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. యూనివర్సిటీలో మంగళవారం ఈగల్ బృందం తనిఖీలు చేసి డ్రగ్స్, గంజాయిని పట్టుకుంది. విద్యాసంస్థల్లో వ్యాపిస్తున్న మత్తు పదార్థాల ముఠాలను అణచివేయడానికి ప్రభుత్వం ఈగల్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. కొరియర్‌లో, ఎంటర్‌ప్రైజెస్ పేరుతో వస్తున్న పార్సల్స్‌లో గంజాయి, డ్రగ్స్ ఉంటున్నాయని గుర్తించిన ఈగల్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీతోపాటు చుట్టుపక్కల మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఈగల్ బృందాలు విచారణ చేపట్టాయి. మంగళవారం హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈగల్ బృందం దాడులు జరిపాయి ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ‘ఓజీ’ వీడ్, ప్యాకింగ్ పౌచ్‌లు, డిజిటల్ వెయింగ్ మెషిన్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈగల్ బృందాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహీంద్రా యూనివర్సిటీలో ఈగల్ టీమ్ పోలీసులు సోదాలు చేశారు. విద్యార్థులు డ్రగ్స్ వినియోగదారులుగానే కాకుండా పంపిణీదారులుగా కూడా వ్యవహరించారని గుర్తించారు. విద్యార్థులు మహ్మద్ అషార్ జావీద్‌ఖాన్, నేవీల్‌ను అరెస్టు చేశారు. వారిని విచారించగా.. ఢిల్లీలో ఉండే నైజీరియాకు చెందిన ”నిక్”తో సంబంధాలు పెంచుకుని అతని నుంచి ‘ఏండీఏంఏ’ గోలీలు తెప్పిస్తున్నారని తేలింది. వాటిని హాస్టళ్లలో, పబ్‌లలో స్నేహితులకు విక్రయించారని తెలిసింది. మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న మణిపూర్‌కు చెందిన నెవెల్ టాంగ్‌బ్రామ్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నాడు. సరఫరాదారునికి యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. సులువుగా డబ్బులు వస్తుండటంతో అదే యూనివర్సిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన మహ్మద్ అసర్ జావీద్ ఖాన్, జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, బుస్సా శివకుమార్‌తో చేతులు కలిపాడు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి గంజాయి తెప్పించుకుంటున్నారు. ఢిల్లీలో రూ.30వేలకు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్న నిందితులు యూనివర్సిటీలోని విద్యార్థులకు, సూరారంతోపాటు వివిధ ప్రాంతాల్లో స్నేహితులకు, కావాల్సిన వారికి డ్రగ్స్ అమ్మి గ్రాముకు రూ.2500 వసూలు చేస్తున్నారు. ‘ఓజీ’ వీడ్ పిల్స్‌ను సిగరేట్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. ఈగల్ టీమ్ పోలీసులు యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులను విచారించారు. వారిలో డ్రగ్స్ పాజిటివ్ రావడంతో సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. నలుగురిని అరెస్టు చేశారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES