– నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు
– రూ.80వేల జరిమానా
నవతెలంగాణ-తిప్పర్తి
నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై లైంగికదాడి కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను దోషిగా నిర్ధారించింది. కోర్టు ఇన్‌చార్జి జడ్జి రోజారమణి.. నేరస్థునికి 51 ఏండ్ల జైలు శిక్ష విధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. 2021లో తిప్పర్తి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఇంటికి వస్తుండగా షేక్ మహమ్మద్ ఖయ్యూం బలవంతంగా తన బండిపై ఎక్కించుకునాడు. ఓ పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదైంది. మూడున్నరేండ్లపాటు సాగిన విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువు కావడంతో కోర్టు మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. లైంగికదాడి కేసులో 20 ఏండ్లు, పోక్సో కేసులో 20 ఏండ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేండ్లు, సెక్షన్ 506(బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది.. మొత్తం 51 ఏండ్ల శిక్ష, రూ.80వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఏఎస్‌ఐ మట్టయ్య, ప్రాసిక్యూషన్‌కు సహకరించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, సీఐ కె.కొండల్‌రెడ్డి, తిప్పర్తి ఎస్‌ఐ వి.శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ కిరణ్ కుమార్, లైజన్ అధికారులు, పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ అభినందించారు.
లైంగికదాడి కేసులో 51ఏండ్ల్ల జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES