– నిరూపణ కష్టమే!
– ఏం కావాలో చెప్పరు… చూపించే పత్రాలను తిరస్కరిస్తారు
– వాళ్లడిగే ఆధారాలు చూపాలంటే చుక్కలే
– చొరబాటుదారుల ఏరివేత పేరుతో వ్యతిరేక ఓటర్లకు చెక్
– బీహార్ తర్వాత తెలంగాణలోనూ ‘సర్’
– సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బట్టకాల్చి మీదేయడం అంటే ఇదే! రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని పట్టుకొచ్చి, లాకప్‌లో పడేసి, ఏవేవో కేసులు రాసేసి, వాటన్నింటిలో నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహారశైలి కూడా అచ్చం ఇలాగే ఉంది. చడీచప్పుడు లేకుండా ఓటర్ జాబితాల్లోంచి పేర్లు తొలగించేసి, నువ్వు ఆ నియోజకవర్గ ఓటరువే అని నువ్వే నిరూపించుకోవాలని చెప్తున్నారు. ‘సర్’ పేరుతో ఇప్పటి వరకు బీహార్లో జరుగుతున్న తంతు ఇదే. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ఇప్పటికే లీకులు ఇచ్చేశారు. రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయనీ, ‘సర్’ను ఇక్కడ కూడా అమలు చేయాలని ఆయనే నేరుగా కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు స్వయంగా పత్రికాముఖంగా ప్రకటన కూడా చేసేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు తమ పౌరసత్వ నిరూపణ పత్రాల్ని సిద్ధంగా ఉంచుకోవాల్సిన టైం దగ్గరికి వచ్చేస్తోంది. తస్మాత్ జాగ్రత్త!!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతావనిలో పౌరసత్వం అనేది ఓ పరీక్ష. దానిలో మీరు ఎన్నటికీ కృతార్థులు కాలేరు. అంటే భారత పౌరుడినేనని నిరూపించుకోవడం ఇప్పుడు చాలా కష్టం. మహారాష్ట్ర నుంచి అస్సాం వరకూ ‘చొరబాటు దారుల ఏరివేత’ పేరుతో కేంద్రం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. స్వస్థలాలనుంచి ఉపాధి వెతుక్కుంటూ ఏవేవో రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది.
చొరబాటుదారుల ఏరివేత పేరుతో…
అట్టడుగు వర్గాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. అత్యంత శక్తివంతమైన జనాభా మిషన్‌ను ప్రారంభిస్తున్నామని మోడీ ఆ సందర్భంగా ప్రకటించారు. అయితే ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో ఆయన చెప్పలేదు. కానీ అనుమానిత ‘చొరబాటుదారుల’ ముద్రవేసి, మేం అలాంటోళ్లం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యతను ప్రజలపైనే పెట్టేస్తారని మాత్రం అర్థమవుతోంది.
నిరూపణ కష్టమే
పౌరసత్వంపై దాఖలైన కొన్ని పిటిషన్లకు సంబంధించి న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఊరట కలిగించే అంశమే. అయితే ఓటర్ ఐడీలు, ఆధార్‌లు, పాన్‌కార్డులు పౌరసత్వానికి రుజువులు కావని కేంద్ర ఎన్నికల సంఘం అంతకుముందు వాదించింది. ఆ కార్డులు కేవలం ప్రభుత్వ సేవలు పొందడానికి మాత్రమే ఉపయోగ పడతాయని తెలిపింది. దీనితో ఇప్పుడు ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో పౌరసత్వాన్ని పరీక్షించే చర్యలకు కేంద్రం పాల్పడుతోంది. భారతీయులుగా నిరూపించుకునేం దుకు ఇప్పుడు లక్షలాది ముస్లింలు, అణగారిన వర్గాల వారికి ఇబ్బందులు తప్పవని తేలిపోతోంది.
ఏం కావాలో చెప్పరు..
తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వారిని టార్గెట్ చేసి చొరబాటుదారులు అని స్వయంగా ప్రధాని అభివర్ణించినప్పుడు, చెద పురుగులు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈసడించుకున్నప్పుడు మనం భారతీయ పౌరులమేనని నిరూపించుకోవడం ఎంత కష్టం? అసలు పౌరసత్వాన్ని నిరూపించుకోవడా నికి అవసరమైన పత్రాలు ఏమిటనేది ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పనే లేదు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ నెల ఐదవ తేదీన లోక్‌సభలో ఓ సభ్యుడు ఇదే ప్రశ్నను సూటిగా అడిగారు. దానికి కేంద్రం ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. అదే ప్రశ్నను మళ్లీ ఇదే నెల 12వ తేదీన మరో ఎంపీ లేవనెత్తితే, కేంద్రమంత్రులు డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారే తప్ప, స్పష్టత మాత్రం ఇవ్వలేదు. మేం ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవడానికి ప్రజలు తమవద్ద ఉన్న ఆధారాలు చూపితే, అవి చెల్లవని మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా చెప్పిస్తున్నారు. జనాభా మిషన్ నిర్వహణలోనూ ఇలా జరగదనే గ్యారెంటీ ఏం లేదు. ప్రతి పౌరుడికీ జాతీయ గుర్తింపు కార్డు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ‘ఆధార్’ కోసం ఎందుకన్ని కోట్లు ఖర్చు చేశారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. గమ్మత్తుగా పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని ధృవీకరించదని కేంద్రం వాదిస్తోంది. అది కూడా పుట్టుకతో పౌరసత్వాన్ని నిరూపించదని చెప్తోంది. అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ వంటివి కూడా పౌరసత్వ నిరూపణకు సరైన పత్రాలు కాదని చెప్తే, ఇక ప్రజలు ఏం చేయాలి. అసలు ఈ జనాభా మిషన్ లక్ష్యం ఏంటనే దానిపైనే స్పష్టత లేదు. బహుశా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ రాజకీయపార్టీ బీజేపీకి దీనిపై స్పష్టత ఉండొచ్చేమో కానీ, సాధారణ ప్రజలకు ఆ స్పష్టత రావట్లేదు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణలో 65 లక్షల మంది పేర్లను తొలగించిన విషయం గమనార్హం.
బర్త్ సర్టిఫికెట్ ఉండాల్సిందే…
బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను ప్రచురించాలని, వారిని తొలగించిన కారణాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించడం ఆ రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించింది. అయితే ఈ ఆదేశాలను ప్రతి ఓటరు పరిశీలనకూ వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో కూడా ‘సర్’ను చేపట్టాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. కొత్తగా ఓటరుగా నమోదు అయ్యే వారి కోసం ఎన్నికల కమిషన్ 11 పత్రాలను నిర్దేశించింది. అయితే వీటిని పొందడం అంత సులభం కాదు. ఉదాహరణకు భారతీయుల్లో 6.5 శాతానికి మించి పాస్‌పోర్టులు లేవు. ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో 62 శాతం మందికి మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం పౌరసత్వంపై కొత్తగా ఆలోచన చేయాలని అనుకుంటే, జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేసి దేశవ్యాప్తంగా పౌరుల రిజిస్టర్‌ను ప్రారంభిస్తే లక్షలాది భారతీయులు తమ జనన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తాము భారతీయులమేనని నిరూపించుకోవడానికి వారు ఎన్ని తరాలు ఎదురు చూడాలో ఊహిస్తేనే ఆందోళన రెట్టింపవుతోంది. బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్నది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. క్రమేణా ఇదే పద్ధతిని దేశం మొత్తానికి వ్యాప్తిచేయాలనేది మోడీ సర్కార్ యోచన. దానిలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మినహాయింపు లేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో ప్రజలంతా బర్త్ సర్టిఫికెట్ల కోసం పరుగులు పెట్టాల్సిందే…గెట్ రెడీ!!