– ఇండ్ల నిర్మాణాలకు వెయ్యి కోట్లు విడుదల
– బిల్లుల కోసం లబ్దిదారులే ఫోటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు
– హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ గౌతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇంతవరకు వెయ్యి కోట్లు విడుదల చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ.గౌతం వెల్లడించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడితే జైలుకు పోవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇప్పటివరకు 2.04 లక్షల ఇండ్ల పనులు ప్రారంభం కాగా, అందులో లక్ష ఇండ్లు బేస్‌మెంట్ లెవల్‌కు చేరుకున్నాయని తెలిపారు. మూడు నెలల్లో రెండు లక్షలకు పైగా ఇండ్ల పనులు ప్రారంభమైనట్టు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్ కేంద్ర కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, డిప్యూటీ ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం జోరుగా అమలు జరుగుతున్నదని తెలిపారు. పీడీలు, డీఇఇలు నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల వల్ల నిరంతరం పర్యవేక్షణతోపాటు పథకం అమలులోని లోటుపాట్లపై అధికారులకు స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు. డీఈఈలు తమకు నిర్దేశించిన విధులను సక్రమంగా, సమర్థంగా నిర్వహించాలని హితవు పలికారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు విడుదల అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులకు సంబంధించిన పురోగతి, బిల్లుల విడుదలకు అవసరమైన ఫోటోలను ఆయా గ్రామ కార్యదర్శులే కాకుండా, నేరుగా లబ్ధిదారులే తమ ఫోటోలను అప్‌లోడ్ చేసే సౌలభ్యం యాప్‌లో ఉందన్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, కేటాయింపులతోపాటు, ఆయా కాలనీల్లో మంచినీరు, కరెంటు వంటి మౌలిక వసతుల కల్పన పనులపై ఆయన సమీక్షించారు. నిర్ణీత కాలపరిమితిలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో పలు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతోపాటు హౌసింగ్ కార్పొరేషన్ సలహాదారు ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్ ఎం. చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వెంకటదాస్‌రెడ్డి, భాస్కరరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు పాల్పడితే జైలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES