– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ : నక్సలిజం ముప్పును ఎదుర్కోవడానికి సల్వాజుడుం తీర్పు ఆటంకంగా నిలిచిందని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదని ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తాను ఉద్యోగాన్ని కోరుకోవడం లేదని, తనను ఎవరూ నియమించలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ది వైర్’ పోర్టల్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు, భావజాలం, పదవీ విరమణ తర్వాత నిర్వహించిన పాత్ర తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సల్వాజుడుంపై ఇచ్చిన తీర్పు 14 సంవత్సరాల పాతదని, నక్సలిజంపై పోరాటానికి అది అడ్డుగా నిలిచిందని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇంటర్వ్యూలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నారంటే…
సుప్రీంకోర్టుపై…
ఉప రాష్ట్రపతి పదవికి మేమిద్దరం (అమిత్ షా, సుదర్శన్ రెడ్డి) పోటీ పడుతున్నామని అనుకోవడం లేదు. అలాంటి కథనాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. నేను పదవి నుంచి తప్పుకోవడానికి మూడు నాలుగు రోజుల ముందు సల్వాజుడుం తీర్పు ఇచ్చాము. నక్సలిజం ముప్పును ఎదుర్కోవడానికి ఈ తీర్పు అడ్డుగా వచ్చిందని ఎవరూ, ఎప్పుడూ అనలేదు. నా ద్వారా మాట్లాడింది సుప్రీంకోర్టే. తీర్పునకు ఒక న్యాయమూర్తిని బాధ్యుడిని చేయడం, ఒక వ్యక్తిని వేలెత్తి చూపేలా కథనాన్ని అల్లేందుకు ప్రయత్నించడం, అవాస్తవాన్ని ఆపాదించడం…దీనిని హోం మంత్రి విజ్ఞతకు వదిలేయడం మంచిది. దానిని గురించి ఎక్కువగా మాట్లాడడం ప్రమాదకరం.
భావజాలంపై…
ఆయన (ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్) ఒక నిర్దిష్ట భావజాలం నుంచి వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు. నేను ఆ భావజాలాన్ని పంచుకోను. నేను లిబరల్ కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రాట్‌ని అని చెబుతూనే ఉన్నాను. నాకు అది (పోరాటం) సైద్ధాంతి కంగా మారింది. ఎందుకంటే మాకు సర్వోత్కృష్టమైన ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అభ్యర్థిగా ఉన్నాడని అవతలి పక్షం చెబుతోంది. దీనిపై స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను లిబరల్ కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రాట్‌ని అని జాతికి చెప్పుకోవాల్సి ఉంది. ఇది వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తి గత ద్వేషమూ లేదు. కోపమూ లేదు. అగౌరవమూ లేదు. ఇది ఉప రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నిక కాబట్టి ఎలాంటి ద్వేషం లేదా ఉద్రిక్తత పెంచే ఉద్దేశం లేకుండా న్యాయబద్ధంగా మంచి పోటీ ఉండాలని అను కున్నాను. ఉద్రిక్తతను పెంచడానికి నేను కారణం కాదని మీరు అంగీకరిస్తారు. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరేందుకు ఎంపీలను కలుస్తున్నాను. గోవా లోకాయుక్తగా నా పదవీ కాలాన్ని కుదించడం వెనుక రాజకీయ కారణమేమీ లేదు. నేను ముందుగా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదునే తీసుకున్నాను. ఆయన చాలా మర్యాదగా తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని గుర్తించాను. ఫిర్యాదును తోసిపుచ్చాను.
కృతజ్ఞుడిని…
ఇండియా బ్లాక్‌కు వెలుపల వారు కూడా మద్దతిస్తున్నారు : జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు
ఇండియా బ్లాక్‌లో లేనివారు కూడా తనకు మద్దతునివ్వడానికి వస్తున్నారని, అందుకు తాను కృతజ్ఞుడినని ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ఆలోచించి, ”యోగ్యత” ప్రాతిపదికన తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
”ప్రతిపక్షాలు నన్ను విశ్వసించాయని, ఒక అభ్యర్ధిగా ఎంపిక చేశాయని మీ అందరికీ తెలుసు. ఇండియా అలయన్స్‌కి చెందిన వారు మాత్రమే కాకుండా, ఆ కూటమికి వెలుపల వున్న వారు కూడా నాకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తుందుకు కృతజ్ఞుడిని. అయితే, నా స్నేహితుడు అఖిలేష్ యాదవ్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.” అని ఆయన లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే మద్దతునివ్వడానికి ముందుకు వస్తున్న వారు ఎవరన్నదీ ఆయన వివరాలు వెల్లడించలేదు. ఇటీవలనే తాను ఢిల్లీలో ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్‌ను, చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశానని చెప్పారు. మావోయిజానికి తాను మద్దతిస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై మాట్లాడుతూ దానిపై తాను చర్చ పెట్టాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అమిత్ షా ప్రకటన గురించి మాట్లాడుతూ, వారు దీనిపై కథనం అల్లడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను ఏదైతే సమాధానం చెప్పాలనుకున్నానో అది చెప్పాను.ఇక చెప్పాల్సిందేమీ లేదుని అన్నారు. ఈ రోజు వార్తాపత్రికలు చూసినట్లైతే, చెప్పాల్సిన అవసరమున్నందతా చెప్పేశాను, చర్చను పొడిగించాలనుకోవడంలేదు, చెప్పేది కూడా ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ కార్యాలయం కానందున తాను రాజకీయ అంశాలు మాట్లాడబోనని చెప్పారు.
ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న పాలక, ప్రతిపక్ష అభ్యర్ధులిరువురూ దక్షిణాదికి చెందినవారే కావడం వల్ల ఈ పోటీ సౌత్ వర్సెస్ సౌత్ అన్న చందంగా మారింది. పాలక ఎన్డీఏ అభ్యర్ధి సి.పి.రాధాకృష్ణన్ కాగా, ప్రతిపక్షాల అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇరువురి మధ్య ప్రత్యక్ష పోటీకి రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 9న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన బీజేపీ నేత కాగా, జస్టిస్ రెడ్డి తెలంగాణాకు చెందిన వ్యక్తి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. ఇటీవలనే జగ్‌దీప్ ధన్కర్ ఆకస్మికంగారాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను సైద్ధాంతిక పోరుగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
నక్సలిజంపై పోరాటానికి సల్వాజుడుం తీర్పు అడ్డుకాదు
- Advertisement -
- Advertisement -