నవతెలంగాణ-హైదరాబాద్: లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో చైనా “వనరులను చొరబడి దోచుకుంటోంది” అని యుఎస్ సదరన్ కమాండ్ అధిపతి చేసిన ఆరోపణలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఖండించారు. యుఎస్ ఆరోపణలు నిరాధారమైనవని, కాలం చెల్లిన వాక్చాతుర్యమని పేర్కొన్నారు. ఆయా ప్రాంతంలోని దేశాల సార్వభౌమాధికారం, నిర్ణయాలను గౌరవించాలని చైనా ప్రతినిధి గువో జియాకున్ అమెరికాను కోరారు. కొంతమంది యుఎస్ అధికారులు ఇప్పటికీ సంఘర్షణలో పాతుకుపోయిన కోల్డ్ వార్ మనస్తత్వాన్ని పట్టుకున్నారని విమర్శించారు.
యుఎస్ ఆధిపత్య స్వభావానికి విరుద్ధంగా, చైనా యొక్క దీర్ఘకాలిక సూత్రాలు పరస్పర గౌరవం, సమానత్వం, నిష్కాపట్యత మరియు గెలుపు-గెలుపు సహకారమని తెలిపారు. చైనా-లాటిన్ అమెరికా భాగస్వామ్యం రెండు వైపుల అవసరాలు, ఉమ్మడి ప్రయోజనాలను తీర్చిందని మరియు ప్రాంతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సమర్థవంతంగా ప్రోత్సహించిందని గువో అన్నారు. దీనిని ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ దేశాలు తమ సొంత అభివృద్ధి భాగస్వాములను, మార్గాలను స్వేచ్ఛగా ఎంచుకునే హక్కును కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
కరేబియన్‌లో యుఎస్ సైనిక జోక్యానికి వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసనల సమయంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. రష్యా, ఇరాన్ వంటి దేశాలు, అంతర్జాతీయ పౌర సమాజ సంస్థలు వెనిజులాకు సంఘీభావం ప్రకటించాయి.