నవతెలంగాణ-హైదరాబాద్: 11 ఏళ్లుగా తనతో సొంత పార్టీ నేతలే ‘ఫుట్‌బాల్’ ఆడుకున్నారని, తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ అగ్రనాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఫుట్‌బాల్ గిఫ్ట్‌లు ఇవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్లమెంటులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా సొంత పార్టీ వారే డిస్టర్బ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “నా అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తన మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నా ఏరియాలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏముంది?” అని నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ నాయకత్వం వెంటనే సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.