నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మరణించారు. మరో 17 మందికి గాయాలు కాగా.. వారిలో 14 మంది పిల్లలున్నట్లు అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ ప్రారంభమైన మూడో రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా చర్చి కిటికీల గుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తర్వాత అతడు కూడా మృతిచెందాడని, అతని వయసు 23 ఏండ్లు ఉంటాయని చెప్పారు. నిందితుడిని రాబిన్ వెస్ట్‌మ్యాన్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. కాల్పులకు మూడు తుపాకులు వినియోగించాడని, వాటిని చట్టబద్ధంగానే కొనుగోలు చేశాడని వెల్లడించారు. అతనికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదన్నారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, స్కూలులో కాల్పులపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.