Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రధాని మోడీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారు : రాహుల్ గాంధీ

ప్రధాని మోడీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారు : రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ‘ఓట్‌ చోర్‌- గద్దీ ఛోడ్‌’ అనే నినాదంతో ఆయన చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా ఈరోజు సీతామఢీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లను అక్రమంగా తొలగించారని, ఇది ఓట్ల దొంగతనం కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్లను దొంగిలిస్తున్నాయి. గతంలో మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోనూ ఇదే విధంగా చేశారు. ఇప్పుడు బిహార్ వంతు వచ్చింది. కానీ, బిహార్ ప్రజలు తమ ఓట్లను దొంగిలించడానికి అంగీకరించరు” అని హెచ్చరించారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు, బలహీన వర్గాలకు చెందినవేనని ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని రాహుల్ స్పష్టం చేశారు.

కొంతమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా దొంగిలించిన ఓట్లతోనే ఏర్పడిందని, ప్రధాని సైతం ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక సీతాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నెల 17న ప్రారంభమైన ‘ఓటర్ అధికార్ యాత్ర’ 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad