నవతెలంగాణ-హైదరాబాద్ : వందేభారత్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. సికింద్రాబాద్-తిరుపతి, మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్, దేవ్‌గఢ్-వారణాసి, హవ్‌డా-రౌర్కెలా, ఇందౌర్-నాగ్‌పుర్ మధ్య నడిచే వందేభారత్ రైళ్లలో ఎక్కువ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం మూడు మార్గాల్లో 16 కోచ్‌లు, నాలుగు రూట్‌లలో ఎనిమిది కోచ్‌ల వందేభారత్ రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 కోచ్‌ల రైలును 20 కోచ్‌లతో, ఎనిమిది కోచ్‌ల రైళ్ల స్థానంలో 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రజా సంబంధాలు) దిలీప్ కుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) వందేభారత్ రైళ్ల రద్దీ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
సికింద్రాబాద్-తిరుపతి సహా మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి మార్గాల్లో ప్రస్తుతం 16 కోచ్‌ల వందేభారత్ నడుస్తుండగా.. దీనిని 20 కోచ్‌లకు పెంచనున్నారు. మిగతా నాలుగు మార్గాల్లో ఎనిమిది కోచ్‌ల రైళ్లు నడుస్తుండగా.. వాటి స్థానంలో 16 కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడు మార్గాల్లో కోచ్‌ల అప్‌గ్రేడ్‌తోపాటు మరిన్ని 20 కోచ్‌ల వందేభారత్ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చే 16, 8 కోచ్‌ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగిస్తామన్నారు.