నవతెలంగాణ-హైదరాబాద్: హమాస్ లొంగకపోతే, గాజాను విలీనం చేసుకుంటామని ఇజ్రాయిల్ మంత్రి ఒకరు హెచ్చరించారు. హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టడానికి నిరాకరిస్తే, గాజా స్ట్రిప్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభించాలని ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెలె స్మోట్రిచ్ గురువారం ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. సుమారు రెండేళ్ల యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయిల్ హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఏడాది చివరినాటికి గాజాను స్వాధీనం చేసుకునేందుకు రూపొంచిన ప్రణాళికను మీడియాకి వివరించారు.
ప్రణాళిక ప్రకారం.. గాజాలో ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయాలని, వారిని నిరాయుధులుగా లొంగిపోవాలని హమాస్‌కి అల్టిమేటం జారీ చేయబడుతుందని అన్నారు. హమాస్ నిరాకరిస్తే, నాలుగు వారాల్లో ప్రతి వారం ఇజ్రాయిల్ గాజా భూభాగంలోని ఒక భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఈ విధంగా గాజా స్ట్రిప్‌లోని ఎక్కువ భాగాన్ని ఇజ్రాయిల్ తన నియంత్రణలోకి తీసుకోవాలని స్మ్రోట్రిచ్ ప్రకటించారు. ముందుగా పాలస్తీనియన్లను గాజాలో దక్షిణ ప్రాంతానికి వెళ్లమని ప్రకటించాలని, ఆ తర్వాత ఇజ్రాయిల్ ఉత్తర మరియు సెంట్రల్ గాజాలో మిగిలిన హమాస్ ఉగ్రవాదులను ముట్టడించి, నిర్బంధించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవచ్చని స్మోట్రిచ్ పేర్కొన్నారు.
ఈ ప్రణాళికతో గాజాను మూడు, నాలుగు నెలల్లోనే ఆక్రమించుకోవచ్చని అన్నారు. గాజా ఆక్రమణ కోసం ఈ ప్రణాళికను స్వీకరించాల్సిందిగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకు పిలుపునిచ్చారు. జెరూసలెం తూర్పున ఇఐ అని పిలిచే ప్రాంతంలో ఇజ్రాయిల్ చేపట్టిన స్థిరనివాస ప్రాజెక్టు ”పాలస్తీనాను తుడిచిపెట్టేందుకు ” ఉద్దేశించినదని స్మోట్రిచ్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను హమాస్ ఖండించింది. ”బలవంతంగా స్థానభ్రంశం చెందాలని ఆదేశించడం, మన ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న జాతి ప్రక్షాళన విధానాన్ని బహిరంగంగా ఆమోదించడం”గా పేర్కొంది.