Tuesday, May 6, 2025
Homeరాష్ట్రీయంకొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు

కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు

- Advertisement -

– ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
– రైతు మహౌత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు
– నంగునూర్‌ మండలంలోదెబ్బతిన్న మామిడి తోటల పరిశీలన
నవతెలంగాణ-సిద్దిపేట, నంగునూర్‌

రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదనీ.. రోజుల తరబడి ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూసే దయనీయ పరిస్థితి నెలకొందనీ, ఆ క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు జరుగుతున్నాయని, ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట మార్కెట్‌యార్డ్‌లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూలూరు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జలపతిరెడ్డి అనే రైతు మృతి చెందాడని, ఏప్రిల్‌ 21న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో హనుమండ్ల ప్రేమలత అనే మహిళా రైతు హఠాన్మరణం చెందిందని, ఏప్రిల్‌ 22న మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి కొనుగోలు కేంద్రంలో బిర్రు వెంకన్న, ఏప్రిల్‌ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కొనుగోలు కేంద్రంలో చింతకింది హనుమయ్య మరణించారని తెలిపారు. ధాన్యపు రాశులే సాక్ష్యంగా, కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యత వహించాలని అన్నారు. సాగు నీళ్లు అందించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, కాంటాలు పెట్టడంలో, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో, బడాయిగా చెప్పిన బోనస్‌ అందజేయడంలో ఘోర వైఫల్యం చెందారన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహౌత్సవాలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. ధాన్యం అమ్మిన డబ్బులు 10 రోజులు దాటుతున్నా రైతులకు చెల్లించడం లేదన్నారు. 70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు 24.43 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. దీని విలువ రూ.5664 కోట్లు అని, చెల్లించింది రూ.3163 కోట్లు మాత్రమేనని తెలిపారు. వివిధ కారణాలు చెప్పి 5కిలోల దాకా తరుగు తీస్తుండటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదన్నారు. బోనస్‌ ఇస్తామని ప్రకటించారు తప్ప ఆచరణ లేదని, బోనస్‌ పెద్ద బోగస్‌ అయ్యిందన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 25లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 10.32 లక్షల టన్నుల సన్నాలు, 14.11 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయని, దీని విలువ రూ.515.82 కోట్లు కాగా, ఇప్పటి వరకు చెల్లించింది సున్నా అని, అంటే బోనస్‌ను సున్నా చేశారని అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో వెంటనే పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు పంట నష్టం చెల్లించాలని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులతో మాట్లాడుతున్న సమయంలో లారీలు అందుబాటులో లేవని, హమాలీలు సరిపోవడం లేదని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా.. ఆయన సంబంధిత వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మచ్చ వేణుగోపాల్‌ రెడ్డి, గుండు భూపేష్‌, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలంలోని దర్గపల్లి గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను హరీశ్‌రావు పరిశీలించి రైతులను ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -