నవతెలంగాణ ఆలేరు
వచ్చే నెల 9వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్య నేతలను కోరారు. శుక్రవారం నాడు నవతెలంగాణతో మాట్లాడుతూ మహారాష్ట్రలో శివసేన అధ్యక్షులు ఉద్దేవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరత్ పవర్ కలిసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఇండియా బ్లాక్ అభ్యర్థి రాజ్యాంగాన్ని కాపాడడంలో నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి అని వారికి వివరించి మద్దతు కోరినట్లు చెప్పారు .
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ సభల సభ్యులు సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సి ఉంది అన్నారు. హోం మంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడమంటే అమిత్ షాకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదన్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా తీర్పు ఇస్తే అది నక్సలైట్లు అనుకూలంగా ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తీర్పు అతను ఒక్కడే ఇవ్వలేదని త్రిసభ్య కమిటీ ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వీరితోపాటు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులు హర్షవర్ధన్, ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్షా గైక్వాడ్, కాంగ్రెస్ రాజ్యసభ వీప్ నాజీ హుస్సేన్ తదితరులున్నారు.