Tuesday, May 6, 2025
Homeరాష్ట్రీయంరేవంత్‌ రెడ్డి మంచి మిత్రుడు

రేవంత్‌ రెడ్డి మంచి మిత్రుడు

- Advertisement -

– ఆయనతో విబేధాల్లేవు
– సీఎం కాబట్టే సమస్యలపై ప్రశ్నిస్తున్నాం
– తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనాలి
– తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాదు : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంచి మిత్రుడనీ, ఆయనతో తనకు విభేదాల్లేవని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సీఎం కాబట్టే ఆయన్ను రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎక్కడా పాలకమండళ్లు లేవనీ, పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. తెలంగాణ రోల్‌ మోడల్‌ అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి..గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో కూడా డబ్బుల్లేవనీ, కాగితాలిచ్చి లోన్లు తెచ్చుకోవాలని గుత్తేదారులకు ప్రభుత్వం చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గుత్తేదారులు కూడా సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారంటే కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? అని అడిగారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. చివరకు వారి దగ్గర కూడా కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్‌ పార్టీవాళ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు నిధులివ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరుతామని చెప్పారు. రేవంత్‌ రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ బొంద పెట్టబడిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. అందాల పోటీలకు తాము వ్యతిరేకంగా కాదుగానీ…ముందుకు రాష్ట్రంలోని రైతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ గుత్తేదారు కాంగ్రెస్‌ కు చెందిన సుబ్బిరామిరెడ్డి అనీ, ఆయన దివాళా తీసి ఫ్లైఓవర్‌ పూర్తిచేయలేక పారిపోయారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -