నవతెలంగాణ-భిక్కనూర్
యూరియా పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిందని మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలుచున్న ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెద్దమల్లారెడ్డి, జంగంపల్లి గ్రామాలలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని యూరియా కోసం కుటుంబ సభ్యులందరూ క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఇటీవల భారీ వర్షాలకు ఓవైపు పంట నష్టం, మరోవైపు యూరియా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ చెల్లించడంలో విఫలమైందని, రైతులు గత పదేళ్లలో ఏనాడు ఇబ్బందులు ఎదుర్కోలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు లింగం, సాయ గౌడ్, స్వామి, బ్రహ్మచారి, శ్రీనివాస్, రవీందర్, స్వామి, తదితరులు ఉన్నారు.