నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు. బీజింగ్‌లో జరిగే సైనిక కవాతులో పాల్గొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ రైల్లో వచ్చారు. విదేశీ పర్యటనలు అంటే చాలా హడావుడి.. హంగామా ఉంటుంది. అందుకు భిన్నంగా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం రైల్లో చైనాకు వచ్చారు. మంగళవారం బీజింగ్‌లో జరిగే సైనిక కవాతులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్‌లో సైనిక కవాతు జరుగుతోంది. ఈ కవాతును జిన్‌పింగ్, కిమ్ కలిసి వీక్షించనున్నారు.

చైనా సైనిక కవాతులో పాల్గొనేందుకు సోమవారం ప్యోంగ్యాంగ్ నుంచి కిమ్ జోంగ్ రైల్లో బయల్దేరారు. విదేశాంగ మంత్రి చో సోన్-హుయ్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి రైల్లో ప్రయాణించారు. రెండేళ్ల క్రితం రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి కూడా కిమ్ రైల్లోనే వెళ్లారు. అలాగే హనోయ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్‌ను కలిసేందుకు వియత్నాంకు 60 గంటలు ప్రయాణం చేశారు. ఇక 2018లో సింగపూర్‌లో తొలిసారి ట్రంప్‌ను కలిసేందుకు చైనా అందించిన బోయింగ్ 747 విమానంలో కిమ్ వెళ్లారు.