Wednesday, May 7, 2025
Homeఆటలుటైటాన్స్‌ మురిసింది

టైటాన్స్‌ మురిసింది

- Advertisement -

– ఉత్కంఠ ఛేదనలో గుజరాత్‌ గెలుపు
– ముంబయి 155/8, గుజరాత్‌ 147/7
నవతెలంగాణ-ముంబయి

వరుణుడు ఆటంకం కలిగించినా.. ఉత్కంఠ ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో కుదించిన లక్ష్యాన్ని ఆఖరు బంతికి ఛేదించింది. 18 ఓవర్ల తర్వాత టైటాన్స్‌ 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా.. వర్షంతో మ్యాచ్‌ నిలిచింది. డక్‌వర్త్‌ పద్దతిలో టైటాన్స్‌ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులకు సవరించారు. దీంతో 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా రాహుల్‌ తెవాటియ (11 నాటౌట్‌), గెరాల్డ్‌ కోయేట్జి (12, 6 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసిన టైటాన్స్‌ సీజన్లో ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ లాంఛనం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత శుభ్‌మన్‌ గిల్‌ (43, 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), జోశ్‌ బట్లర్‌ (30, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రూథర్‌ఫోర్డ్‌ (28, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 113/2తో గెలుపు దిశగా సాగుతున్న టైటాన్స్‌ను బుమ్రా వరుస వికెట్లతో దెబ్బకొట్టాడు. 18 ఓవర్లలో 126/6తో టైటాన్స్‌ ఒత్తిడిలో పడింది. అయినా, ఆఖరు ఓవర్‌ థ్రిల్లర్‌లో టైటాన్స్‌ పైచేయి సాధించి.. ముంబయి వరుస విజయాల జోరుకు బ్రేక్‌ వేసింది.
మెరిసిన జాక్స్‌, సూర్య
టాస్‌ ఓడిన ముంబయి ఇండియన్స్‌ సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. మహ్మద్‌ సిరాజ్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే గుజరాత్‌ టైటాన్స్‌కు బ్రేక్‌ అందించాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌ (2)ను సాగనంపాడు. వరుస అర్థ సెంచరీల జోరుమీదున్న రోహిత్‌ శర్మ (7) సైతం వేగంగానే వెనక్కి వెళ్లాడు. 26/2తో పవర్‌ప్లేలోనే కష్టాల్లో కూరుకున్న ముంబయి ఇండియన్స్‌ను విల్‌ జాక్స్‌ (53, 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (35, 24 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నారు. విల్‌ జాక్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రతికూల పరిస్థితుల్లో 43 బంతుల్లో 71 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. టైటాన్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో పరుగులు అంత సులువుగా రాలేదు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన విల్‌ జాక్స్‌.. ముంబయి ఇండియన్స్‌ను దూకుడు పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు. ఐదు బౌండరీలతో మెరిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో ధనాధన్‌ షో చేయకపోయినా.. ఆకట్టుకున్నాడు. తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్య (1), నమన్‌ ధిర్‌ (7) నిరాశపరిచారు. ఆఖర్లో కార్బిన్‌ బాచ్‌ (27, 22 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు ముంబయి ఇండియన్స్‌ 155 పరుగులు చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో సాయి కిశోర్‌ (2/34) రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ సిరాజ్‌ (1/29), అర్షద్‌ ఖాన్‌ (1/18), ప్రసిద్‌ కృష్ణ (1/37), రషీద్‌ ఖాన్‌ (1/21), గెరాల్డ్‌ కోయేట్జి (1/10) వికెట్ల వేటలో సమిష్టిగా రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -