– ఔషధ ఉత్పత్తిని నిలిపివేస్తున్న నోవో నార్దిస్క్
– ‘హ్యూమన్ ఇన్సులిన్’ సరఫరాకు స్వస్తి
– ఇక ప్రత్యామ్నాయాలు వెతకాల్సిందే
– కేంద్రంలో కానరాని స్పందన
న్యూఢిల్లీ: మధుమేహ వ్యాధి చికిత్స కోసం తాను ఉత్పత్తి చేస్తున్న ఔషధాన్ని దశల వారీగా తొలగిం చాలని డెన్మార్క్‌కు చెందిన బహుళజాతి ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ నిర్ణయించింది. దీనిపై మన దేశానికి చెందిన పలువురు మధుమేహ రోగులు తమ న్యాయవాదుల ద్వారా ఈ నెల ఐదవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు ఓ లేఖ రాశారు. నోవో నార్డిస్క్ కంపెనీ నిర్ణయంపై అత్యవసరంగా చర్యలు చేపట్టాలని అందులో కోరారు. నోవో నార్డిస్క్ కంపెనీ పెన్ను రూపంలో ‘హ్యూమన్ ఇన్సులిన్’ను ఉత్పత్తి చేస్తోంది. ఇది మధుమేహ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ ఔషధం ఉత్పత్తిని నిలిపివేయాలని ఆ కంపెనీ నిర్ణయించింది. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను మాత్రమే విక్రయిస్తారు. అంటే ఇకపై ఈ మందు ఉత్పత్తి జరగదు.
‘వెగోరీ’ తయారీ కోసమే…
అధిక బరువును తగ్గించే వెగోవీ అనే ఔషధాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నందున మానవ ఇన్సులిన్ పెన్నులను దశల వారీగా తగ్గిస్తున్నట్లు నోవో నార్డిస్క్ కంపెనీ 2003 నవంబరులోనే ఒక ప్రకటన విడుదల చేసింది. మధుమేహానికి అధిక బరువు ప్రధాన కారణం కనుక వెగోసీ ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నామని తెలిపింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గు ర్తించాలి. టైప్-1 డయాబెటిస్‌కు అధిక బరువు కారణంగా రాదు. అది ఆటో ఇమ్యూన్ డిజాస్టర్. టైప్-2 డయాబెటిస్‌కు మాత్రమే అధిక బరువుతో సంబంధం ఉంటుంది.
రెండు రూపాలలో…
ఇన్సులిన్ రెండు రూపాలలో…హ్యూమన్, అనలాగ్… లభిస్తోంది. ఇవి రెండూ ఇంజక్షన్లే. ఇన్సులిన్ ఏ మాత్రం ఉత్పత్తి జరగని లేదా కొద్ది మోతాదులో ఉత్పత్తి అయ్యే రోగులను టైప్-1 డయాబెటిస్ రోగులుగా పరిగణిస్తారు. టైప్-2 రోగులలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ అది అవసరమైన పరిమాణంలో ఉండదు. టైప్-1 రోగులు పూర్తిగా ఇంజక్షన్ పైనే ఆధారపడతారు. భోజనానికి 30-60 నిమిషాల ముందు హ్యూమన్ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అనలాగ్ రూపంలో ఉండే ఇన్సులిన్‌ను భోజనానికి ముందు…ఏ మాత్రం వేచిచూడకుండా తీసుకోవచ్చు. ఇది వేగంగా పనిచేస్తుంది. అయితే భారత్ వంటి వర్ధమాన దేశాలలో, కొన్ని ఆఫ్రికా దేశాలలో హ్యూమన్ ఇన్సులిన్‌నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అనలాగ్ కంటే చౌకగా లభిస్తుంది.
ఏం చేయాలి?
ఇక రోగుల ముందు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి. హ్యూమన్ ఇన్సులిన్ పెన్నులను ఉపయోగిస్తున్న వారుఅనలాగ్ రూపానికి మారడం. అంటే వారు ఖరీదైన మందును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ రూపంలోని ఔషధాన్నే కొనసాగించాలని అనుకుంటే మాత్రం వయల్స్ లేదా సిరంజీలను వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అత్యవసర మందుల జాబితాలో అనలాగ్ ఇన్సులిన్‌ను చేర్చాలని రోగుల తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. ఎందుకంటే ఆ జాబితాలో చేర్చే ఔషధం ధరలు తగ్గుతాయి. రోగులు వయల్స్‌కు మారాలని అనుకుంటే పిల్లల పైనే ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే వారు సిరంజీలకు భయపడతారు. వృద్ధులు, దృష్టి లోపం ఉన్న వారు, సిరంజీలను ఉపయోగించడంలో ఇబ్బంది పడే వారికి కూడా సమస్యలు తప్పవు. పైగా సిరంజీల ద్వారా తీసుకునే వయల్స్ మోతాదులో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
చౌకగా లభించే వయల్స్
ఇన్సులిన్ పెన్నులు, వయల్స్ రూపాలలో దొరుకుతుంది. పెన్నులో ఇన్సులిన్‌ను ముందుగానే నింపుతారు. దానిని తీసుకున్న తర్వాత పారేయాల్సిందే. అందుకే వీటిని డిస్పోజబుల్ పెన్నులు అంటారు. వయల్స్ రూపంలో లభించే ఇంజక్షన్‌ను తిరిగి ఉపయోగించవచ్చు. అంటే దీనిలో ఇన్సులిన్‌ను అనేకసార్లు నింపవచ్చునన్న మాట. పెన్నులతో పోలిస్తే వయల్స్ చాలా చౌక. కానీ రోగులు సాధారణంగా పెన్నులనే ఇష్టపడతారు. ఏదేమైనా రాబోయే ఆరు నెలల కాలంలో పెన్నుల రూపంలో ఉండే హ్యూమన్ ఇన్సులిన్ క్రమేపీ అదృశ్యమవుతుంది. ఆ తర్వాత
అది ఇక కన్పించవు. అయితే ఇన్సులిన్ వయల్ రూపంలో మాత్రం లభిస్తూనే ఉంటుంది.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
ఇన్సులిన్ మార్కెట్‌లో నోవో నార్డిస్క్‌దే అగ్రస్థానం. ఒక్క మన దేశంలోనే దాని మార్కెట్ రూ.4,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే నోవో నార్డిస్క్ నిర్ణయం కారణంగా రోగులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. నోవో నార్డిస్క్‌తో పాటే కొన్ని ఇతర కంపెనీలు కూడా హ్యూమన్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. బయోకాన్, ఎల్ లిలీ, సనోఫీ, ఎరిస్ లైఫ్ సైన్సెస్ అనేవి వీటిలో కొన్ని. అయితే వాటి ధరలు మారుతుంటాయి. నోవో నార్డిస్క్ వదిలేసిన ఖాళీని భర్తీ చేయాలంటే ఈ కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను బాగా పెంచాల్సి ఉంటుంది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా కొన్ని దేశాలు ఇప్పటికే తమ వైద్యులకు మార్గదర్శకాలు జారీ చేశాయి. భారత్‌లో మాత్రం ఎలాంటి సలహాలు, మార్గదర్శకాలు లేవు. మన దేశంలో 133 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు. ప్రపంచంలోని డయాబెటిస్ రోగులలో 30 శాతం మంది భారత్‌లోనే ఉండడం గమనార్హం. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అనలాగ్ ఇన్సులిన్‌ను సరఫరా చేయవచ్చునని వైద్య నిపుణులు సూచించారు. అనలాగ్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు.
చక్కెర రోగులకు చేదు వార్త
- Advertisement -
- Advertisement -