నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సర్టిఫికెట్లపై యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విచారణ జరపాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు అమోల్ మిత్కారి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సంబంధించిన వైరల్ వీడియో వివాదం తర్వాత ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మిత్కారి సెప్టెంబర్ 5, 2025న న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సమర్పించిన విద్యా, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర పత్రాల ప్రామాణికతపై అమోల్ మిత్కారి తన లేఖలో సందేహాలను లేవనెత్తారు. ఈ పత్రాల వివరణాత్మక ధృవీకరణను నిర్వహించాలని ఆయన యుపిఎస్‌సిని అభ్యర్థించారు.
కాగా, శుక్రవారం మహారాష్ట్రలోని ఓగ్రామంలో అక్రమ ఇసుక రవాణాను ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్సీపీకి చెందిన నేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఫోన్ చేశాడు. అక్కడ్నుంచి వెళ్లిపోవాలని ఐఎస్ఎస్ అధికారికి డిప్యూటీ సీఎం ఆదేశించాడు. అయితే ఫోన్లో మాట్లాడిన వ్యక్తి డిప్యూటీ సీఎం అని నిర్ధారించుకోవడానికి తన నెంబర్‌కు వీడియో కాల్ చేసి చెప్పాలని సదురు అధికారి పేర్కొంది. దీంతో అజిత్ పవార్ ఆగ్రహాంతో ఊగిపోయాడు.