Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంరాష్ట్రం దివాలా తీసిందనడం పకడ్బందీ స్కెచ్‌

రాష్ట్రం దివాలా తీసిందనడం పకడ్బందీ స్కెచ్‌

- Advertisement -

– చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి
– ఉద్యోగుల మీదికి ప్రజలను ఉసిగొల్పే కుట్ర : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందనటం పకడ్బందీ స్కెచ్‌ అనీ, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల మీదకు ప్రజలను ఉసిగొల్పే కుట్ర అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా నడిపించలేని స్థితిలో ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓవైపు ఉద్యోగులను భయపెడుతూ మరోవైపు ఇచ్చిన హామీలను తప్పించుకునే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఆర్థిక సంక్షోభ బూచీ చూపెట్టి సంక్షేమ పథకాలను ఇవ్వలేమని ప్రజలను ప్రిపేర్‌ చేస్తున్నారన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలతో బి-ట్యాక్సులు తీసుకొని బిల్లులు పాస్‌ చేసినప్పుడు కనపడలేదా ఆర్థిక సమస్య అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా ఏది కట్‌చేయాలి? అని సీఎం అడగటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రే అప్పులు పుట్టడం లేదనీ, అప్పుకోసం వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారని ప్రజలను భయాందోళనకు గురిచేయడం దారుణమని విమర్శించారు. ఉచిత కరెంటు, వృద్ధాప్య పింఛన్లు, మహాలక్ష్మి, కొత్తరేషన్‌ కార్డుల జారీ వంటి పథకాలను నిలిపేయాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉందని చెప్పారు. రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, సర్పంచులకు ఇవ్వాల్సిన బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రొఫెసర్లు జీతాల కోసం ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యపాలనకు ప్రతీక అని విమర్శించారు. కాంగ్రెస్‌ మంత్రులకు చెందిన కంపెనీలకు వందల కోట్ల రూపాయల బిల్లులు ప్రాధాన్యతతో చెల్లిస్తూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ బకాయిల కోసం నిధుల్లేవని చెప్పడం దారుణమన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు రూ. 1,100 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు జరిగినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమిచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాడుతామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -