నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి, కన్నబిడ్డనే తీసుకెళ్లి ఫ్రీజర్‌లో పెట్టింది. 15 రోజుల వయసున్న ఆ పసికందు ప్రాణాలతో బయటపడటం అదృష్టమనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం తన 15 రోజుల శిశువును ఫ్రీజర్‌లో పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఫ్రీజర్ నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై ఫ్రీజర్ తెరిచి చూడగా, అందులో చలికి వణికిపోతున్న పసికందు కనిపించింది. హుటాహుటిన చిన్నారిని బయటకు తీసి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
శిశువును పరీక్షించిన వైద్యులు, చిన్నారి ఆరోగ్యంగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ, ఆ తల్లి ప్రసవానంతరం తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతోందని నిర్ధారించారు. ప్రసవం తర్వాత శరీరంలో హార్మోన్ల మార్పులు, తీవ్ర ఒత్తిడి కారణంగా ఇలాంటి మానసిక రుగ్మతలు తలెత్తుతాయని వివరించారు.
ఈ పరిస్థితిలో ఉన్న తల్లులు ఒక్కోసారి అహేతుకంగా ప్రవర్తిస్తారని, తమకు తాము గానీ, పిల్లలకు గానీ హాని చేసుకునే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. సరైన వైద్య సహాయం, కుటుంబ సభ్యుల మద్దతుతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వారు సూచించారు.