నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.
మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వరద బాధితులతో సంభాషించనున్నారు. అలాగే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఆప్దా మిత్ర బృందాలను కలవనున్నారు. అనంతరం రాష్ట్రంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
ఇక సాయంత్రం 4:15 గంటలకు ప్రధాని మోడీ పంజాబ్ చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం సీనియర్ అధికారులతో చర్చించనున్నారు. అటు తర్వాత వరద బాధిత కుటుంబాలతో సంభాషించనున్నారు. అలాగే రెస్క్యూ, రిలీఫ్ బృందాలతో కూడా మాట్లాడనున్నారు.