నవతెలంగాణ-హైదరాబాద్ : ఆడిటింగ్ కోసం వచ్చానని నమ్మించి, సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఉడాయించాడో కేటుగాడు. సినిమాను తలపించే ఈ భారీ మోసం ఏలూరు జిల్లా చింతలపూడిలో వెలుగుచూసింది. ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్‌గా వచ్చిన వ్యక్తి చేసిన ఈ పని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వడ్లమూడి ఉమామహేశ్ అనే వ్యక్తి వచ్చాడు. తాను విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చానని, ఆడిటర్‌నని బ్రాంచ్ మేనేజర్ యాదాల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆశను నమ్మించాడు. ఖాతాదారుల తాకట్టు బంగారం ప్యాకెట్లను పరిశీలించాలని ఆదేశించాడు. దీంతో సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 380 బంగారు ఆభరణాల ప్యాకెట్లను అతని ముందు ఉంచారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ప్యాకెట్‌ను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఉమామహేశ్ కాలయాపన చేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మేనేజర్, క్యాషియర్‌ను కొబ్బరినీళ్లు తీసుకురావాలని బయటకు పంపాడు. వారు తిరిగి వచ్చి చూసేసరికి ఉమామహేశ్ కనిపించలేదు. అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని చూడగా, ఉమామహేశ్ నగలన్నింటినీ తన బ్యాగులో సర్దుకుని వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
అతను అపహరించిన బంగారం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితుడు చింతలపూడి బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి, మార్గమధ్యంలో దిగి మరో వాహనంలో తెలంగాణ వైపు పరారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.