నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం పెను విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. రెండురోజులు జెన్ జెడ్ నిరసనకారులు నానా బీభత్సం సృష్టించారు. ఆ దేశ పార్లమెంట్ భవనంతో పాటు అధికార, ప్రతిపక్షాల నాయకులను ఇండ్లను తగలబెట్టారు. దొరికిన నేతలను చితకబాదారు. రోడ్డలపై టైర్లను తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. పల్లెల నుంచి దేశ రాజధానిలో భారీ హింస చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
ఈ సంఘటనలో పలువురు నిరసన కారులు మృతి చెందారు. ఈక్రమంలో పరిస్థితిని అదుపు చేయడానికి ఆ దేశ ప్రధాని ఓలి శర్మ తన పదవి రాజీనామా కూడా చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. ఆ దేశ అధికార పగ్గాలు ఆర్మీ హస్తగతం చేసుకుంది. రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జాతిని ఉద్దేశిస్తూ గత అర్ధరాత్రి ప్రసంగించారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అన్నారాయన. అదే సమయంలో విధ్వంసం, దాడులు, దోపిడీ వంటి చర్యలు కొనసాగితే.. ఆర్మీ కఠినంగా స్పందిస్తుంది అని ప్రకటించారు.
ఆర్మీ ఇప్పటికే కీలక ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంది. ట్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సింగదుర్బార్, పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాల్లో సైనికులు మోహరించారు. గత రాత్రి 10 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దీంతో శాంతించిన జెన్ జెడ్ నిరసనకారులు తమ సందేశాన్ని ఆర్మీ అధినేతకు తెలియజేశారు.
ఇది కేవలం సోషల్ మీడియా నిషేధంపై స్పందన కాదని యువత అంటోంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని అంటోంది. అలాగే.. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని అంటోంది. ఈ క్రమంలో.. ఉద్యమ నిర్వాహకులు తమ కీలక డిమాండ్లు ప్రకటించారు.
కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపు
నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించడం
వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు & ఆర్థిక సహాయం అందించడం
నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు