పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తినేందుకు అది కావాలి, ఇది కావాలి అని గోల గోల చేస్తుంటారు. వాళ్ల పోరు పడలేక ఏదో ఒకటి పెడితే నచ్చలేదని నానా రభస చేస్తుంటారు. అలాంటి సమయంలో వాళ్లకి నచ్చచెప్పాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అందుకే అటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ రెసిపీలు ట్రై చేయండి. సైలెంట్‌గా లొట్టలేసుకుంటూ తినేస్తారు.
మసాలా పఫ్డ్ ఎగ్
కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం – చిన్న ముక్క, టమాటా – ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు- రుచికి సరిపడా, కారం- టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి- అర టీస్పూన్, గరం మసాలా- పావు టీస్పూన్, చాట్ మసాలా- అర టీస్పూన్, కోడిగుడ్లు – ఆరు, ఆలూ చిప్స్ – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాట, కరివేపాకు, కొత్తిమీర, అల్లాన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరో గిన్నెలోకి కొన్ని ఆలూ చిప్స్ తీసుకుని లైట్‌గా క్రష్ చేసుకుని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి లోతు ఎక్కువగా ఉన్న పెనం పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఆ ఎగ్స్‌లోకి కలిపి ఉంచిన మసాలా మిశ్రమం ఓ రెండు స్పూన్లు వేసి లైట్‌గా కలపాలి. ఆ తర్వాత అందులోకి క్రష్ చేసిన చిప్స్, లైట్‌గా కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
మీడియం ఫ్లేమ్‌లో ఓవైపు కాలిన తర్వాత రెండోవైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే మసాలా పఫ్డ్ ఎగ్ రెడీ.
చిట్కాలు:
– ఆలూ చిప్స్ బదులు కార్న్‌ఫ్లేక్స్‌ను ఫ్రై చేసి తీసుకోవచ్చు.
– పోపు వేసుకునే చిన్న కడాయి ఉపయోగిస్తేనే ఈ ఎగ్ రెసిపీ ప్లఫ్పీగా వస్తుంది.
క్యారెట్ ఆలూ వడలు
కావాల్సిన పదార్థాలు: కందిపప్పు – వంద గ్రాములు, శనగపప్పు – వంద గ్రాములు, ఉప్పు – రుచికి సరిపడా, ఆలుగడ్డలు – రెండు, క్యారెట్ – రెండు, ఉల్లిగడ్డ – రెండు, పచ్చిమిర్చి – మూడు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, వాము – అర చెంచా, నల్ల జీలకర్ర – అర చెంచా, పసుపు – అర చెంచా, కారం – అర చెంచా, బేకింగ్ సోడా – అర టీస్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: ముందుగా ఓ మిక్సింగ్ బౌల్‌లోకి కందిపప్పు, శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు గంట సేపు నాననివ్వాలి. పప్పులు నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా మిక్సీజార్‌లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వడల కోసం మినపప్పును ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. తర్వాత క్యారెట్, ఆలుగడ్డలపై పొట్టు తీసేసి కడిగి సన్నగా తురుముకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలోకి గ్రైండ్ చేసిన పప్పులు, క్యారెట్, ఆలుగడ్డ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, వాము, నల్ల జీలకర్ర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని వడలుగా చేసి నూనెలో రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుంటే సరిపోతుంది. వీటిని నేరుగా తిన్నా లేదంటే గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్‌తో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది.
చిట్కాలు:
– కందిపప్పు, శనగపప్పుకు బదులు బియ్యప్పిండి, శనగపిండి కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల వడలు మరింత తొందరగా తయారవుతాయి.
– అవసరమనుకుంటే పిండిలో కొద్దిగా అల్లం తరుగు, కరివేపాకు వేసుకుంటే రుచి మరింత బాగుంటాయి.
ఉల్లి మిక్చర్
తీసుకోవాల్సిన పదార్థాలు: నూనె – తగినంత, అటుకులు – ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, ఉల్లిగడ్డ – రెండు (పెద్ద సైజ్‌వి), ఉప్పు – రుచికి సరిపడా, కారం – ఒక టీస్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – ఒక టీస్పూన్, చాట్ మసాలా – టీస్పూను, నెయ్యి – టీస్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నిమ్మకాయ – ఒకటి.
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డలను, కొత్తిమీరను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసుకొని వేడయ్యాక మందపాటి అటుకులను వేసి వేయించుకోవాలి. నూనెలో వేగి చక్కగా పొంగిన అటుకులను ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. అదే నూనెలో పల్లీలను వేసి మాడిపోకుండా వేయించుకోవాలి. వీటిని వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసి బాగా కలిసేలా పైకీ కిందకు చేయాలి. తర్వాత బౌల్‌లో ఉన్న టిష్యూ పేపర్‌ను బయటకు తీసేయాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, నెయ్యి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ పిల్లలకు నిమిషాల్లో ఇలా చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు.
టిప్స్ :
నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అటుకులను వేసి వేయించుకోవాలి. ఎందుకంటే నూనె కాగకముందు వేస్తే అటుకులు ఎక్కువ ఆయిల్‌ని పీల్చుకోవడమే కాకుండా తెల్లగా, సరిగా పొంగవని గుర్తుంచుకోవాలి. అలాగే పల్చగా ఉండే అటుకులు కాకుండా కాస్త మందంగా ఉండే వాటిని తీసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది.
ఆకు పకోడీ
కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి – మూడు కప్పులు, శనగపిండి – కప్పు, వాము – చెంచా, కారం – చెంచా, పసుపు – పావు చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, వెన్న – పావు కప్పు.
తయారీ విధానం: పెద్ద వెడల్పాటి పాత్రలోకి బియ్యప్పిండిని జల్లించి తీసుకోవాలి. అందులో శనగపిండి వేసి కలుపుకోవాలి. మిక్సీజార్‌లోకి వాము, కారం, ఉప్పు, పసుపు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని బియ్యప్పిండిలో వేసి కలుపుకోవాలి. అందులో కరిగించిన బటర్ వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్‌గా, మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్‌గా కలుపుకుని పక్కన ఉంచాలి. అయితే పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకుని చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ఇనుప కడాయి పెట్టి డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలోకి ఆకు పకోడీ వేసుకునేందుకు సరిపడే బిళ్లను సెట్ చేసుకోవాలి. ఈ గొట్టంలోకి పిండిని కొద్దిగా తీసుకుని మూత పెట్టేయాలి. కాగుతున్న నూనెలో ఆకు పకోడీని ఒక చుట్టు మాత్రమే ఒత్తుకోవాలి. ఎక్కువ మందంగా ఒత్తుకుంటే పిండి సరిగ్గా కాలక తొందరగా పాడవుతాయి. పిండిని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాలేవరకు వేయించి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
టిప్స్
– పిండిని జల్లించి తీసుకోవడం వల్ల అందులో ఏమైనా పురుగులు, నూక ఉంటే తొలగిపోతాయి. కావాలనుకుంటే శనగపిండిని కూడా జల్లించుకోవచ్చు.
– వెన్న లేకపోతే పిండిలో వేడి నూనెను వేసి కూడా కలుపుకోవచ్చు.
– ఆకు పకోడీని కాల్చేందుకు నూనె కచ్చితంగా వేడి ఉండాలి. ఆయిల్ వేడిగా లేకపోతే పిండి సరిగ్గా ఉడకదు, పైగా నూనె పీల్చుకుంటాయి.
– కావాలనుకుంటే మీరు సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులో వేసుకోవచ్చు.
సాయంత్రం స్నాక్స్
- Advertisement -
- Advertisement -