రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఫూలే, అంబేద్కర్ యాదిలో’ ప్రారంభించిన మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర గొప్ప స్ఫూర్తిపథంగా సాగింది. ఫూలే, అంబేద్కర్‌ల గురించి దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ మహిళాభివృద్ధిని కాంక్షించిన గొప్ప నాయకులు. అందుకు బాటలు వేసిన మహనీయులు. స్త్రీకి విద్య అవసరమని గుర్తించిన ఫూలే..1848లో మొట్టమొదట బాలికల పాఠశాలను స్థాపించారు. ఇక అంబేద్కర్ బాలికలకు విద్యనందించటంలో ఎన్ని ఆటంకాలొచ్చినా వాటిని తట్టుకుని అమలు చేసేందుకు జీవి తాంతం కషిచేశారు. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన కీలక భూమికను పోషించారు. అందులో స్త్రీలకు సమాన హక్కులు, గౌరవం, మర్యాద, విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యం వంటివి కల్పించారు. విద్య, సమానత్వం, ఆస్తి, గౌరవం, హక్కులు ఎందుకని, భర్త చెప్పినట్టు వినాలనే ధోరణితో అణిచి వేయబడిన ఈ దేశంలో, ఆడవాళ్లు కూడా మనుషులే, వారికి కూడా సమాన హక్కులుండాలని, పార్లమెంట్‌లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి. అంబేద్కర్, ఫూలే ఈ ఇద్దరూ సామాజిక న్యాయం కోసం చేసే పోరాటాలకు నేటికీ తరగని స్ఫూర్తి ప్రదాతలు. అందుకే ఐద్వా కేంద్రకమిటీ పిలుపునందుకుని చేపట్టిన ఈ యాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమై పందొమ్మిది జిల్లాల్లోని 21 కేంద్రాల్లో సభలు నిర్వహించి మహిళల్లో స్ఫూర్తి నింపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగింపుసభతో భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేసింది.మహిళల రక్షణకు అనేక కర్తవ్యాలను తీసుకుంది. వాటి ఆధారంగానే పాలకులు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
మనువాదాన్ని చొప్పించే కుట్ర
ఐద్వా మహిళల హక్కులకు, వారి రక్షణకు ఏర్పాటైన సంఘం. మహిళల అణచివేతను నిరసిస్తూ ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేస్తూ అనేక చట్టాల్ని సాధించింది. కానీ, వాటిని అమలు చేసే పాలకులు సరిగా లేకుంటే అవి నిర్వీర్యమవుతాయే తప్ప వాటివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మహిళా ఉద్యమాలే శరణ్యంగా నేడు ముందుకెళ్తున్న పరిస్థితి దేశంలో ఉన్నది. పాలకుల మెడలు వంచేలా, వారిపై ఒత్తిడి వచ్చేలా ఐక్య పోరా టాలు చేయడం నిజంగా మంచి పరిణామంగా కనిపిస్తున్నది. అయితే, వరకట్న నిషేధ చట్టం -1961, 498 (ఎ) 1983, ఆస్తి హక్కు చట్టం-1985, భ్రూణ హత్యల వ్యతిరేక చట్టం-1994, గహ హింస నిరోధక చట్టం-2006, లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013, నిర్భయ చట్టం-2012, ఫోక్సో చట్టం-2012, 33 శాతం రిజర్వేషన్ల అమలు చట్టం అనేవి బీజేపీ ఏలుబడిలో పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించినప్పటికీ వారిరువురి మధ్య అసమానత్వం నేటికీ కొనసాగుతున్నది. విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో ఇంకా స్త్రీలు వెనకబడే ఉన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రాథమిక హక్కులను రక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సమానత్వం గురించి మాట్లాడకపోగా, స్త్రీ పుట్టిందే మగవాడికి సేవచేయటానికి, భర్త తిట్టినా, కొట్టినా మౌనంగా భరించాల్సిందే అని చెప్పే మనుధర్మ శాస్త్రాన్ని నేటికీ ప్రజల్లోకి చొప్పించాలనే భావనను ఆరెస్సెస్-బీజేపీ చాపకింద నీరులా ముందుకు తీసుకుపోతున్నది. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమలు చేయటానికి అనేక కుట్రలు పన్నుతున్నది. కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరిట పురుషుల ఆధిపత్య భావజాలం కింద మహిళలు నలిగిపోతున్న తీరు ఒక తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నది. మోడీ సర్కార్ మహిళల పట్ల అనుసరిస్తున్న వైఖరి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నంగా మొత్తం ఎనిమిది డిమాండ్లతో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సాగింది.
మహిళల పట్ల మోడీ వివక్షత
మహిళల పట్ల మోడీ సర్కార్ పూర్తి వివక్షతను ప్రదర్శిస్తున్నది. వారు చేస్తున్న పోరాటాల్ని అణచివేస్తున్నది. సాధించుకున్న చట్టాల్ని తుంగలో తొక్కుతున్నది. మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను ఆరికట్టకుండా నిందితుల పక్షాన నిలబడుతున్నది. హత్రాస్, కథువా,ఆర్‌జికార్ ఘటనల్లో బీజేపీ వ్యవహరించిన తీరు దేశమంతా గమనించింది. పైగా, రాజ్యాంగంలోని లౌకికతత్వం అనే పదాన్ని తీసేస్తాం, రాజ్యాంగాన్నే మార్చేస్తామంటూ మోడీ అనుయాయులు బహిరంగం గానే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రంగా పేరుగాంచిన ఈ గడ్డపై ఐద్వా యాత్ర మరో చరిత్రను లిఖించింది. ‘బాంఛన్ దొరా.. నీ కాల్మొక్తా…’ అని బానిస త్వంలో మగ్గిన పేద ప్రజలే తుపాకులు పట్టి దోపిడీకి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నారన్న చరిత్రను కాషాయపు నేతలు విస్మరిస్తే ఎలా? సాయుధ పోరాటం జరిగిన ఈ గడ్డపైన కాషాయ నేతలు తులసి వనంలో గంజాయి చెట్ల మాదిరి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారు. ఇది మర్రిఊడల్లాగా రాష్ట్రంలో పాతుకపోయే ప్రమాదం పొంచి ఉంది కాబట్టే ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యతగా ఐద్వా తనవంతు పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నది. బీజేపీ ప్రమాదాన్ని ప్రజలు పసిగట్టాలని, వారు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఎంతనష్టం కలిగిస్తున్నాయో చెప్పడం ద్వారా యాత్ర విజయవంతమైంది.
యాత్రకు అపూర్వ స్పందన
ఐద్వా యాత్రకు రాష్ట్రమంతా అపూర్వ స్పందన లభించింది. విద్యార్థి, యువజన, మేధావి వర్గం అన్ని కేంద్రాల్లో యాత్రను స్వాగతించింది. ఆసాంతం అక్కున చేర్చుకుంది. మండుటెండల్లో సైతం మహిళలు చూపించిన ప్రేమ,అభిమానం, ఆప్యాయత యాత్ర బృందాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. వారికి సంఘం మీద ఉన్న నిబద్ధత, అంకితభావం అబ్బురపరిచింది. ఇంటాబయటా పనిచేస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నా మహిళల శ్రమకు గుర్తింపు లేకపోవడం, స్త్రీలు అనేక రంగాల్లో ముందుకు పోతున్నా వారి పట్ల వివక్షత, లైంగిక వేధింపులు, అణచివేత కొనసాగుతుండటం లాంటి సమస్యల పట్ల యాత్ర వేదికల్లో మహిళలు మాట్లాడిన తీరు వేయిగొంతుకలుగా ప్రతిధ్వనించింది. మహిళలపై జరుగుతున్న హింసకు అంతం లేదా?అనే ప్రశ్నలకు కచ్చితంగా ఉంటుందని, అది పోరాటాల ద్వారానే సాధ్యమని ఐద్వా వారిలో ధైర్యాన్ని నింపింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేక హామీలిచ్చినప్పటికీ వాటిని నెరవేర్చడంలో అనేక సమస్యల్ని సాకుగా చూపుతున్నదని కొంతమంది మహిళలు ఆవేదన చెందిన తీరు బాధనిపించింది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు లేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి యాత్ర బృందాన్ని కలిచివేసింది. కరువు పని దినాలు కూడా తగ్గించడంతో, చేతినిండా పనిలేదని, పెరుగుతున్న ధరలతో మేమేలా బతకాలని వారు పడుతున్న బాధ ఐద్వాతో పంచుకుంది. ఈ యాత్ర ముగిసేనాటికి ఎన్నో అనుభవాలు, మరెన్నో ఆవేదనలు, ప్రజలతో మమేకమై, వారిలో కలిసిపోయి చేసిన ఈ ప్రయత్నం బృందానికి నిజంగా స్ఫూర్తినిచ్చింది. మహిళల రక్షణకు, వారి హక్కులకు ఎంతటి వరకైనా తెగించి పోరాడాలనే ఒక ధైర్యాని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. యాత్ర అప్పుడే అయిపోయిందా? అనుకుంటున్న తరుణంలోనే కర్తవ్యపథం మరోసారి గుర్తుకొచ్చింది. కన్నీళ్లను దిగమింగుకుని కదనరంగం వైపు మహిళా బృందం కదిలింది. అంబేద్కర్, ఫూలేలను మనసులోనే తలచుకుంది. ఎర్రెర్రని దారుల్లో..ఎర్ర పూలవనంగా ముందుకు సాగింది.
– మల్లు లక్ష్మి, 9848481099