– నవీన్ మిట్టల్‌కు సీపీఎస్‌ఈయూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్మెన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ నేతృత్వంలో కలిశారు. రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదని తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా చందా చెల్లించే బదులు సీపీఎస్‌ను రద్దు చేస్తే ప్రభుత్వానికి నెలకు రూ.300 కోట్లకుపైగా మిగిలే అవకాశముందని సూచించారు. ఇప్పటి వరకు 14 నెలల నుంచి జమ కాని కాంట్రిబ్యూషన్ రూ.ఆరు వేల కోట్లు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్‌పీఎస్ ట్రస్టుకు రూ.16 వేల కోట్ల నిధులు వెళ్లాయని వివరించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందనీ, దాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినియోగించడానికి వీలవుతుందని కోరారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో 2.50 లక్షల మంది ఉద్యోగుల పాత పెన్షన్ పునరుద్ధరణ ఆకాంక్షను ప్రజాప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి ఆదాయమే
- Advertisement -
- Advertisement -