నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్‌లో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్జేడీకి చెందిన రాజ్‌కుమార్ రాయ్ అలియాస్ అల్లా రాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రగుప్త్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రాయ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రాయ్‌ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
హత్య జరిగిన ప్రదేశంలో ఆరు బుల్లెట్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాట్నా లోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజ్‌కుమార్ రాయ్ సిద్ధమయ్యారు.