– బలహీనవర్గాల ఆత్మబంధువు : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
– వికారాబాద్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-వికారాబాద్
దేశంలోని కోట్లాది మంది దళిత, గిరిజన, బహుజనులు తలెత్తుకుని బతుకుతున్నారంటే ఆ దైర్యం పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, నేటి తరానికి ఆయన ఒక ప్రతీక అని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు అంబేద్కర్ అని కొనియాడారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి కూడలిలో ఏర్పాటుచేసిన 12 అడుగుల అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని.. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందరరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, కాలే యాదయ్యతో కలిసి స్పీకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. పట్టణ ముఖద్వారం ఎన్నేపల్లి చౌరస్తాలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్‌కు గౌరవం లభించిందని అన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయ, సామాజిక రంగాల్లో తమ వాటాను పొందుతూ, ప్రజాప్రతినిధులు అవుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ అని తెలిపారు. తాను పడిన కష్టాలు, అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదని అంబేద్కర్ రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని మనకు ఇచ్చారన్నారు. ఆయన దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలను అందుకోవాలని సూచించారు.
అంబేద్కర్ ఒక కులానికో, మతానికో సంబంధించిన వారు కాదని, ఆయన ఈ దేశ ప్రజల ఆస్తి అని అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్టెట్‌లో రూ.40,232 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దిక్సూచి చూపిన మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్, ఆర్థిక కమిటీ సభ్యులు రమేష్ మహారాజ్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్‌నాయక్, ఆర్టీఏ మెంబర్ జాఫర్, దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ నేటి తరానికి ఒక ప్రతీక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES