నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు కురిసిన ఎడతెరిపి వర్షం ప్రభుత్వ పాఠశాలను చెరువును తలపించేలా మార్చింది. ఆవరణతో పాటు వంటగదులు, తరగతి గదుల్లోనూ నీరు నిలవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిలో మోకాళ్ల వరకు నడుస్తూ పిల్లలు తరగతులకు చేరుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్న భోజనం కూడా నీటితో చుట్టుముట్టిన తరగతుల్లోనే వంతెనపై కూర్చున్నట్టుగా సాగింది.
ఇప్పటికే “కుంటలను తలపిస్తున్న తరగతి గదులు” పేరుతో వచ్చిన వార్తకు స్పందిస్తారేమోనని గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురుచూశారు. కానీ జిల్లా అధికారులు, కలెక్టర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.